కొనసాగుతున్న వైద్యుల సమ్మె | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న వైద్యుల సమ్మె

Oct 2 2025 8:21 AM | Updated on Oct 2 2025 8:21 AM

కొనసాగుతున్న వైద్యుల సమ్మె

కొనసాగుతున్న వైద్యుల సమ్మె

గ్రామీణులకు తప్పని అవస్థలు

డీఎంహెచ్‌ఓ ముందుచూపులేని నిర్ణయంతో చిక్కులు

అనంతపురం మెడికల్‌: జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తించే వైద్యులు సమ్మె కొనసాగిస్తున్నారు. సమ్మెలో భాగంగా బుధవారం ఏపీ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఆవరణలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ నాయ కులు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను సాధించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. క్లినికల్‌ పీజీ సీట్లను 30 శాతం నుంచి 15 శాతం, నాన్‌ క్లినికల్‌ సీట్లను 50 శాతం నుంచి 30 శాతానికి తగ్గించడంతో వైద్యులు నష్టపోతారన్నారు. 2020 బ్యాచ్‌కు సంబంధించి నోషనల్‌ ఇంక్రిమెంట్లు, గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వారికి అలవెన్స్‌లు అందివ్వాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ నాయకులు డాక్టర్‌ నారాయణస్వామి, డాక్టర్‌ సంధ్య, డాక్టర్‌ శివసాయి, డాక్టర్‌ నాన్సి, డాక్టర్‌ సాహితి, డాక్టర్‌ లోకేష్‌, డాక్టర్‌ శివసాయి, ఆసియా, ప్రీతి, సుమన్‌ కుమార్‌, పరమేష్‌, వినోద్‌కుమార్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

స్తంభించిన సేవలు..

పీహెచ్‌సీ వైద్యుల సమ్మెతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు స్తంభించాయి. రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు తదితర సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అవస్థలు పడుతున్నారు. గర్భిణులు, బాలింతలు కష్టాలు చెప్పనలవిగా మారాయి.

డీఎంహెచ్‌ఓ ఇష్టారాజ్యం..

ముందుచూపు లేకుండా డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భ్రమరాంబ దేవి తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టింది. వైద్యుల సమ్మె నేపథ్యంలో జిల్లాలోని పలు పీహెచ్‌సీలకు ఏరియా ఆస్పత్రుల నుంచి 28 మంది, బోధనాస్పత్రి నుంచి 26 మంది వైద్యులను కేటాయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి నియమించిన 26 మందిలో పీజీలే ఉన్నారు. ఇందులోనూ 20 మంది వేరే రాష్ట్రాలకు చెందిన వారు. ఈ క్రమంలో భాషా సమస్య తలెత్తడం,ఎటువంటి రవాణా చార్జీలను అందించకపోవడం, పైపెచ్చు సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులను కేటాయించడంతో చాలా మంది ఆస్పత్రులకు వెళ్లలేదు. దీనిపై బుధవారం పీజీలందరూ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శంకర్‌ నాయక్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. భద్రతా సమస్యల నేపథ్యంలో అంతదూరం వెళ్లలేమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ శంకర్‌ నాయక్‌ డీఎంహెచ్‌ఓ భ్రమరాంబ దేవితో మాట్లాడారు. పీజీ వైద్యులను అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు కేటాయించి, అక్కడ పని చేసే వారిని పీహెచ్‌సీలకు పంపితే ఇబ్బందులు ఉండవని చెప్పగా, డీఎంహెచ్‌ మాత్రం తానేమీ చేయలేనని చేతులెత్తేయడం గమనార్హం. ఇక.. పీజీలు బయోమెట్రిక్‌ వేస్తేనే స్టైఫండ్‌ వస్తుంది. బయోమెట్రిక్‌ సౌకర్యం అనంతపురంలోని వైద్య కళాశాలతో పాటు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోనే ఉంటుంది. ఆస్పత్రులకు వెళ్తే బయోమెట్రిక్‌ వేయలేక స్టైఫండ్‌ కూడా రాదు. ఈ విషయాలన్నీ తెలిసినా డీఎంహెచ్‌ఓ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement