
దంపతులపై టీడీపీ నాయకుల దాడి
ఆత్మకూరు: అధికార అండతో రాప్తాడు నియోజకవర్గంలో ‘పచ్చ’ నేతలు రెచ్చిపోతున్నారు. తామేం చేసినా చెల్లుతుందన్న రీతిలో దాడులకు పాల్పడుతున్నారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని దంపతులపై టీడీపీ నాయకులు దాడి చేసిన ఘటన ఆత్మకూరు మండలం బ్రాహ్మణ యాలేరులో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు.. బ్రాహ్మణ యాలేరుకు చెందిన బండి చిన్న అహోబిలం తనకు అనారోగ్యంగా ఉండటంతో సోమవారం ఉదయం అనంతపురం వెళ్లి చికిత్స చేయించుకుని సాయంత్రం గ్రామానికి వచ్చాడు. స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద కూర్చుని ఉండగా టీడీపీ నాయకులు శంకరయ్య, శివయ్యలు అక్కడికి వచ్చి అహోబిలంతో గొడవకు దిగారు. చెప్పులు, రాళ్లతో దాడి చేశారు. విషయం తెలిసి అహోబిలం భార్య కొండమ్మ, కోడలు సుకన్య, కుమారుడు నాగరాజు అక్కడికి చేరుకోగా వారిపైనా దాడికి దిగారు. ఘటనలో కొండమ్మకు పక్కటెముక విరిగింది. అహోబిలంకు గాయాలయ్యాయి. కుటుంబీకులు ఇద్దరినీ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాత కక్షలు మనసులో పెట్టుకొని తన తల్లిదండ్రులపై దాడి చేసినట్లు బండి నాగరాజు తెలిపాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.