
టమాట రైతుకు ధరాఘాతం
ఆత్మకూరు: టమాట ధరలు రైతులను ఊరించి.. ఉసూరుమనిపిస్తున్నాయి. ధర ఆశాజనకంగా ఉంటుందన్న ఉద్దేశంతో రైతులు టమాట సాగు చేశారు. ప్రారంభంలో మంచి ధర లభించినప్పటికీ.. ఇప్పుడు ఉన్నపళంగా తగ్గిపోయాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, మడకశిర, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కంబదూరు, ఆత్మకూరు, రాప్తాడు, కదిరి మండలాల్లో ఎక్కువగా టమాట సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగైంది. నారు, మందులు, ఎరువులు, కూలీల ఖర్చు ఎకరాకు రూ.50 వేల వరకు వెచ్చించారు. ఇక కట్టెలు పాతి పందిరి వేస్తే ఎకరాకు మరో రూ.30వేల దాకా అదనం. అంత శ్రమించి పంట సాగు చేసిన రైతులు ప్రస్తుతం మార్కెట్లో ధరలు చూసి షాక్ అవుతున్నారు.
రోడ్డుపాలు..
మార్కెట్‌లో టమాట ధరలు పూర్తిగా పడిపోయాయి. 15 కిలోల టమాట బాక్సు ధర రూ.20 నుంచి రూ.150 మించడం లేదు. ఈ ధరలు కేవలం మొదట్లో రెండు కటింగులు మాత్రమే అమ్ముడుపోతున్నాయని, కొంచెం కాయల పరిమాణంలో తేడా ఉన్నా, మచ్చలు ఉన్నా ‘నో సేల్’ అంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చాలామంది మార్కెట్‌లో అమ్ముడుపోని టమాటలను రోడ్డు పక్కన పడేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్న రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత అందలేదు. సాగు చేసిన టమాట పంటకు వర్షాల వల్ల మచ్చలు రావడంతో పూర్తిగా నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
భారీగా ధరల పతనం
పెట్టుబడులూ తిరిగిరావడం లేదు
నష్టం వస్తోంది
టమాట రైతులు ప్రస్తుతం నష్టాలు చవిచూస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందలేదు. ధరలు వస్తాయన్న ఆశతో టమాట సాగు చేశాం. కూలీలకు కూడా అందడం లేదు. రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలి. – నారపరెడ్డి, రైతు, పంపనూరు,
ఆత్మకూరు మండలం

టమాట రైతుకు ధరాఘాతం