రాప్తాడు: మండలంలోని గాండ్లపర్తికి చెందిన సాకే పోతులయ్య భార్య, ఇద్దరు కుమార్తెలు కనిపించడం లేదు. సీఐ టీవీ.శ్రీహర్ష తెలిపిన మేరకు.. రాయదుర్గం మండలం గ్రామదట్ల గ్రామానికి చెందిన వన్నూరు స్వామి కుమారై పద్మలతకు గాండ్లపర్తి గ్రామానికి కొండన్న కుమారుడు సాకే పోతులయ్యతో 2021 సెప్టెంబర్ 21న వివాహమైంది. పోతులయ్య ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.
వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నెల 22న ఉదయం పద్మలత తన భర్తకు తెలపకుండా ఇద్దరు కుమార్తెలను తీసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుంచి వారి కోసం కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. ఆచూకీ లక్ష్యం కాకపోవడంతో మంగళవారం రాత్రి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96817కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
రైలు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
రాయదుర్గం టౌన్: రైలు ఢీకొనడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్న కొంతానపల్లికి చెందిన చిత్రయ్య బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో రాయదుర్గంలోని శాంతినగర్ సమీపంలో పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఢీకొనడంతో ఎగిరి పట్టాల పక్కన పడ్డాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.