
అన్నదాతకు తప్పని యూరియా కష్టాలు
అనంతపురం అగ్రికల్చర్: కూటమి పాలనలో కర్షకునికి కష్టాలు తప్పడం లేదు. అవసరం మేరకు తగినంత యూరియా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకట్రెండు బస్తాల కోసం నెల రోజులుగా అన్నదాతలు పాట్లు పడుతున్నారు. సీజన్ మొదట్లో వచ్చిన యూరియా చాలా వరకు పక్కదారి పట్టించడంతో ఇప్పుడు కొరత ఏర్పడినట్లు రైతులు చెబుతున్నారు. పంటలకు వేసుకోవాల్సిన సమయంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆగస్టులో సమృద్ధిగా వర్షాలు పడటంతో వరి, మొక్కజొన్న సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, అలాగే అరటి లాంటి ఉద్యాన పంటల విస్తీర్ణం పెరుగుతోంది. దీంతో పంటలకు యూరియా అవసరం ఏర్పడినా తగినంత అందుబాటులో పెట్టడంలో ప్రభుత్వం, వ్యవసాయశాఖ విఫలమైంది. కొరత తీవ్రంగా ఉండటంతో రైతుల దృష్టిని మళ్లించడానికి అవసరానికి మించి యూరియా వాడితే మంచిదికాదని ప్రచారం సాగిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 32 వేల మెట్రిక్ టన్నులు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నా అందులో జిల్లా రైతులకు చేరింది ఎంతనేది మాత్రం చెప్పడం లేదు. ప్రస్తుతం ఆర్‌ఎస్‌కేల్లో 340 మెట్రిక్ టన్నులు, సొసైటీల్లో 200 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల దగ్గర 550 మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్ పరిధిలో 1,479 మెట్రిక్ టన్నులు, కంపెనీ గోదాముల్లో 110 మెట్రిక్ టన్నులు, రవాణా కింద 500 మెట్రిక్ టన్నుల వరకు ఉన్నట్లు వ్యవసాయశాఖ ప్రకటించినా... క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం కూడా చాలా ఆర్‌ఎస్‌కేల్లో కొన్నిచోట్ల ఒక బస్తా, మరికొన్ని చోట్ల రెండు బస్తాలు ఇచ్చారు. ప్రైవేట్ డీలర్ల దగ్గర కూడా యూరియా కావాలంటే కాంప్లెక్స్, డీఏపీ, నానో యూరియా లేదా డ్రిప్ ఎరువులు లాంటి ప్రస్తుతానికి అవసరం లేనివి అంటగడుతున్న పరిస్థితి నెలకొంది. యూరియా కష్టాలు ఎపుడు తీరుతాయో అనే ఆందోళనలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.