
వీధికుక్క స్వైరవిహారం
● ముగ్గురు విద్యార్థులకు గాయాలు
గుంతకల్లుటౌన్: వీధికుక్క స్వైరవిహారం చేసి ముగ్గురు విద్యార్థులను గాయపరిచింది. పట్టణంలోని ఎస్‌జేపీ హైస్కూల్ రోడ్ ఈద్గా ఆవరణలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న మెహనాజ్ బుధవారం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన వీధికుక్క ఎడమకాలిపై కరిచింది. అలాగే అదే స్కూల్ విద్యార్థులైన అన్నా, చెల్లెలు భువన తేజ (మూడోతరగతి), కేతన (ఒకటో తరగతి)లను తల్లి నేత్రావతి ట్యూషన్‌కు విడిచిపెట్టడానికి వెళ్తోంది. ఆ సమయంలో భువన తేజను కరవడానికి కుక్క మీదకు రావడంతో తల్లి గమనించి కుమారుడిని పక్కకు నెట్టేసింది. ఆ వెంటనే పక్కనే ఉన్న కుమార్తె కేతన వీపుపై కుక్క కరిచింది. ఆ కుక్కను తరిమివేయడానికి ఆమె ప్రయత్నించగా తిరిగి కుమారుడి వీపుపై కరిచింది. తీవ్ర రక్తస్రావంతో అల్లాడిపోతున్న చిన్నారులిద్దరినీ ఆమె స్థానికుల సహాయంతో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లి వ్యాక్సిన్ వేయించారు. గాయపడిన ఈ ముగ్గురు ఈద్గా ఏరియాకు చెందిన వారు. తమ వీధిలో సుమారు 20 వీధి కుక్కలున్నాయని, ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని చిన్నారుల తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతే కానీ మున్సిపల్ అధికారులు పట్టించుకోరా అంటూ పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీధి కుక్క దాడిలో గాయపడిన చిన్నారులు

వీధికుక్క స్వైరవిహారం