
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
● ప్రజా ఉద్యమం తప్పదు
● రేపు ‘చలో వైద్య కళాశాల’
● ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం మెడికల్: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ – పీపీపీ విధానం దుర్మార్గమని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పేదలకు వైద్యవిద్య.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను మంజూరు చేయించారని గుర్తు చేశారు. ఇందులో ఐదు కళాశాలలు ప్రారంభించారన్నారు. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు నూతన మెడికల్ కాలేజీల నిర్వహణ చేపట్టలేమని.. వాటిని ప్రైవేటీకరించాలని పీపీపీ విధానం తీసుకొచ్చిందని మండిపడ్డారు. గతంలోనూ ప్రైవేట్ వైద్య కళాశాలలను తీసుకురావాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయని, అప్పటి సీఎం జనార్దన్‌రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే జనార్దన్‌రెడ్డికి పట్టిన గతే చంద్రబాబుకు కూడా పడుతుందని హెచ్చరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి ఈ నెల 19న ‘చలో ప్రభుత్వ వైద్య కళాశాల’ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
దిగజారుడు రాజకీయాలు తగదు
నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల భవనాల నిర్మాణం అసంపూర్ణంగా ఉన్నాయంటూ మంత్రులు వితండవాదం చేయడమేంటని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఎక్కడైనా తమ జిల్లాకు మంజూరైన కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటే.. దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందిపోయి భవనాల వద్దకు వెళ్లి దిగుజారుడు రాజకీయాలు చేయడం తగదన్నారు. ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీరు మరీ దారుణంగా ఉందన్నారు. ఆయన ఏనాడూ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రయత్నించిన దాఖలాలు లేకపోగా.. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
ఆర్డీటీని నిర్లక్ష్యం చేస్తే ఎలా?
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రెన్యూవల్ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఇటీవల అనంతపురంలో నిర్వహించిన సీఎం చంద్రబాబు సభలో ఆర్డీటీ గురించి ఒక్క ప్రజాప్రతినిధి కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రధాని మోదీతో మాట్లాడి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేసి ఆర్డీటీ సంస్థ సేవలు కొనసాగేలా చూడాలని కోరారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా నేత నరేష్, తదితరులు పాల్గొన్నారు.