
ప్రియురాలే మట్టుబెట్టింది!
● వ్యక్తి హత్య కేసులో వీడిన మిస్టరీ
● ఐదుగురి అరెస్ట్
అనంతపురం: నగరంలోని రాణినగర్‌లో ఈ నెల 13న చోటు చేసుకున్న హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. బుధవారం అనంతపురం ఒకటో పట్టణ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ జి.వెంకటేశ్వర్లు వెల్లడించారు. అనంతపురంలోని రాణినగర్‌లో నివాసముంటున్న బోయ అంజినమ్మతో బుక్కరాయసముద్రం మండలం పొడరాళ్ల గ్రామానికి చెందిన బోయ చిన్నపెద్దన్న (51) సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె దాచుకున్న డబ్బును తరచూ ఇప్పించుకుని తిరిగి ఇవ్వకుండా వేధించేవాడు. దీనికి తోడు విచక్షనారహితంగా కొట్టి గాయపరిచేవాడు. దీంతో ఎలాగైనా చిన్న పెద్దన్నను శాశ్వతంగా వదలించుకోవాలని నిర్ణయించుకున్న అంజినమ్మ తన కుమారుడు బోయ రమేష్‌తో కలసి పథకం వేసింది. ఇందులో భాగంగా ఈ నెల 13న ఫోన్ చేసి చిన్న పెద్దన్నను ఇంటికి పిలిపించుకుంది. అర్ధరాత్రి సమయంలో రమేష్ అనంతపురంలోని ఒకటో రోడ్డు శివాలయం వద్ద నివాసముంటున్న తన స్నేహితులు పఠాన్ సోహైల్, బోయ మురళీ కార్తీక్, కురుబ శివకుమార్‌ను ఇంటికి పిలుచుకెళ్లి తల్లితో కలసి గ్యాస్ సిలిండర్, చేతికి దొరికిన వస్తువులతో మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఘటనలో చిన్న పెద్దన్న అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం చిన్న పెద్దన్న కుమారుడుకి అంజినమ్మ ఫోన్ చేసి ‘మీ నాన్న చనిపోయాడు’ అని తెలిపి స్విచ్ఛాఫ్ చేసింది. దీంతో హతుడి కుటుంబసభ్యులు అనంతపురానికి చేరుకునేలోపు అంజినమ్మ, ఆమె కుమారుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంజినమ్మ, రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో హత్య చేసిన తీరును వివరించారు. వారిచ్చిన సమాచారంతో పఠాన్ సొహైల్, బోయ మురళీకార్తీక్, కురుబ శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.