
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
● వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్
● ‘చలో మెడికల్ కాలేజ్’ విజయవంతం చేద్దాం
అనంతపురం కార్పొరేషన్: రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ స్పష్టం చేశారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి లింగారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్‌తో కలసి ఆయన మాట్లాడారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్వహణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చలో మెడికల్ కాలేజ్ పేరుతో ఈ నెల 19న తలపెట్టిన కార్యక్రమాన్ని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలను విద్యార్థి, యువజన విభాగం నాయకులు పరిశీలించనున్నట్లు తెలిపారు. 2019 నాటికి రాష్ట్రంలో కేవలం 11 వైద్య కళాశాలు మాత్రమే ఉండేవన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో కొత్తగా 17 వైద్య కళాశాలకు ఆమోదం దక్కిందన్నారు. 2023–24లో ఒకేసారి విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల ద్వారా 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. గతేడాది పులివెందులకు మంజూరైన అనుమతులను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. ఉమ్మడి మదన్‌మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యను ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. లింగారెడ్డి, నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు. పేద, సామాన్య మధ్యతరగతి కుటుంబాల జీవితాలతో ఆటలాడుతున్న సీఎం చంద్రబాబుకు బుద్ధి చెబుతామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దాదాఖలందర్, శ్రీనివాసదత్తా, ఉదయ్, అమరనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.