
కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని అడ్డుకునేందుకు మారణాయుధాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మాటు
సాక్షి, టాస్క్ ఫోర్స్/అనంతపురం కార్పొరేషన్: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి గూండాగిరికి అంతేలేకుండా పోతోంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులకు సిద్ధమయ్యారు. మారణాయుధాలు, మందీమార్బలంతో స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కాపుకాశారు. ఈ సందర్భంగా జేసీ అనుచరులు పట్టణంలో హల్‌చల్ చేశారు. వివరాల్లోకి వెళితే... కోర్టు అనుమతులతో తాడిపత్రికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం అనంతపురం వెళ్లారు.
టీడీపీ మూకల దాడిలో గాయపడి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ కౌన్సిలర్ బాబును పరామర్శించి తిరుగు పయనమయ్యారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి అప్పటికప్పుడు వందలాది టీడీపీ కార్యకర్తలతో కేతిరెడ్డి ఇంటికి వెళ్లే ప్రధాన మార్గంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఇనుపరాడ్లు, కర్రలతో కాపుకాశారు. టీడీపీ నాయకులంతా పట్టణంలో హల్‌చల్ చేశారు.
పోలీసులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వచ్చి జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఇంటికి పంపారు. అనంతరం తాడిపత్రికి వస్తున్న కేతిరెడ్డిని మార్గమధ్యంలోనే పుట్లూరు మండలం ఏ కొండాపురం వద్ద అడ్డుకుని, ఆయన స్వగ్రామం తిమ్మంపల్లికి పంపించారు. కోర్టు అనుమతి ఉన్నా, తనను తాడిపత్రికి ఎందుకు అనుమతించరని పెద్దారెడ్డి ప్రశ్నించగా.. పోలీసుల వద్ద సమాధానం లేదు.
పోలీసుల అనుమతి తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి బయటకు వెళ్లినా, తిరిగి వచ్చినా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని తాడిపత్రి పట్టణ ఇన్‌చార్జ్ సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపారు. కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చిందన్నారు. కానీ పెద్దారెడ్డి గురువారం తమ అనుమతి లేకుండానే అనంతపురం వెళ్లారని, అలాగే అనుమతి లేకుండానే తిరిగి తాడిపత్రికి వస్తుండటంతో ఆయన్ను అడ్డుకుని స్వగ్రా>మం పంపినట్లు వెల్లడించారు.
ఇది అప్రజాస్వామికం: అనంత వెంకటరామిరెడ్డి
పెద్దారెడ్డిని అడ్డుకోవడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అనంపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. తాడిపత్రిలో దౌర్జన్యం చేసే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.