సర్కారుకు ‘సుప్రీం’ షాక్‌! తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఓ వ్యక్తిని ఎలా అడ్డుకుంటారు..? | The Supreme Court criticized the conduct of the AP Police | Sakshi
Sakshi News home page

సర్కారుకు ‘సుప్రీం’ షాక్‌! తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఓ వ్యక్తిని ఎలా అడ్డుకుంటారు..?

Aug 30 2025 2:40 AM | Updated on Aug 30 2025 2:40 AM

The Supreme Court criticized the conduct of the AP Police

ఏపీ పోలీసుల తీరును తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం  

తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి గ్రీన్‌సిగ్నల్‌ 

సింగిల్‌ జడ్జి ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు భద్రత కల్పించాలని  రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు సుప్రీం కోర్టు ఆదేశం 

అందుకయ్యే వ్యయాన్ని భరించాలని పెద్దారెడ్డికి సూచన 

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు 

సాక్షి, అమరావతి: అధికార దుర్వినియోగం, కక్షపూరిత రాజకీయాలే లక్ష్యంగా సాగుతున్న టీడీపీ కూటమి సర్కారుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ.. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఊర్లోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న పోలీసులకు దిమ్మతిరిగే షాక్‌నిచ్చింది. 

తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ‘‘ఓ వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు..?’’ అని పోలీసులను ఘాటుగా ప్రశ్నించింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఖర్చును భరించాలని పెద్దారెడ్డికి సూచించింది. 

పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన ఇంటికి వచ్చి ఉండేందుకు వీలుగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై పోలీసులు దాఖలు చేసిన అప్పీల్‌ను తేల్చాలని ధర్మాసనానికి స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ధర్మాసనం ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించిన పెద్దారెడ్డి... 
తన నియోజకవర్గమైన తాడిపత్రిలోకి వెళ్లేందుకు, అలాగే తన ఇంటిలో ఉండేందుకు పోలీసులు అనుమతించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌.. తాడిపత్రిలోని ఇంటికి వెళ్లి నివసించే నిమిత్తం పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. అయితే వీటిని పోలీసులు బేఖాతరు చేయడంతో కోర్టు ధిక్కార పిటిషన్‌ను పెద్దారెడ్డి దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్‌ హరినాథ్‌... తాడిపత్రిలోని ఇంటికి వెళ్లి ఉండేందుకు వీలుగా పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ పోలీసులు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం పెద్దారెడ్డికి భద్రత కల్పించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 

పోలీసులు పదే పదే అడ్డుకున్నారు
పెద్దారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్దార్థ దవే, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, న్యాయవాది అల్లంకి రమేష్‌ వాదనలు వినిపించారు. ఈ కేసు ఓ పౌరుడి ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉన్న వ్యవహారమని నివేదించారు. పిటిషనర్‌ను తన సొంత నియోజకవర్గానికి, సొంత ఇంటికి రాకుండా పోలీసులు పదే పదే అడ్డుకుంటున్నారని, ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. 

పిటిషనర్‌ మాజీ ఎమ్మెల్యే అని, ఆయన్నే పోలీసులు అడ్డుకుంటున్నారంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టును అభ్యరి్థంచారు. ఓ వ్యక్తి తనకు నచ్చిన విధంగా, స్వేచ్ఛగా సంచరించే హక్కును రాజ్యాంగం ఇచ్చిందన్నారు. పెద్దారెడ్డి తన ఇంటికి వస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని చెబుతున్నారని, వాస్తవానికి వాటి పరిరక్షణ బాధ్యత పోలీసులదేనన్నారు.  

భద్రత ఖర్చును భరించేందుకు సిద్ధం
పెద్దారెడ్డికి భద్రత కల్పించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సైతం పోలీసులు అమలు చేయలేదని పెద్దారెడ్డి తరఫు న్యాయవాదులు తెలిపారు. దీంతో పోలీసులపై పిటిషనర్‌ కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేయాల్సి వచ్చిందన్నారు. ఆ ధిక్కార పిటిషన్‌లో సైతం సింగిల్‌ జడ్జి పిటిషనర్‌ పెద్దారెడ్డికి భద్రత కల్పించాలంటూ ఆదేశాలు ఇచ్చారన్నారు. పోలీసులు ఈ ఉత్తర్వులు మొత్తాన్ని సవాలు చేయకుండా, కొంత భాగాన్నే ఎంపిక చేసుకుని అప్పీల్‌ దాఖలు చేశారని దవే, సుధాకర్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 

ఆ అప్పీల్‌కు ఎలాంటి విచారణార్హత లేదన్నారు. తన భద్రతకయ్యే ఖర్చును భరించేందుకు పెద్దారెడ్డి సిద్ధంగా ఉన్నారని ధర్మాసనానికి దవే తెలిపారు. తాడిపత్రిలోని ఇంటికి వచ్చేందుకు పెద్దారెడ్డికి అనుమతినివ్వాలని కోర్టును కోరారు. సొంత భద్రత లేకుంటే అందుకయ్యే వ్యయాన్ని ఆయనే భరించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అయినా ప్రభుత్వం పెద్దారెడ్డికి భద్రత కల్పిస్తుందనుకోవడం లేదని దవే నివేదించారు. 

అధికార పార్టీ పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్‌ జడ్జి ఆదేశాల మేరకు పెద్దారెడ్డికి భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకయ్యే వ్యయాన్ని భరించాలని పెద్దారెడ్డికి సూచించింది.

ఏపీలో దారుణ పరిస్థితులు...!
» ఓ పౌరుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పోలీసులు కాలరాస్తున్నారు
» పెద్దారెడ్డిని సొంత నియోజకవర్గానికి, ఇంటికి రాకుండా పదే పదే అడ్డుకుంటున్నారు
» న్యాయస్థానం ఆదేశాలను సైతం పోలీసులు అమలు చేయలేదు..
»  మాజీ ఎమ్మెల్యేనే అడ్డుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించండి..
» అధికార పార్టీ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది
» సుప్రీంకోర్టుకు నివేదించిన సీనియర్‌ న్యాయవాదులు సిద్దార్థ దవే, పొన్నవోలు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement