
సాక్షి, న్యూఢిల్లీ/అనంతపురం: వైఎస్సార్‌సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి భారీ ఊరట(Big Relief For Kethireddy Pedda Reddy) లభించింది. నియోజకవర్గంలో అనుమతి పెట్టేందుకు ఆయనకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి నిరభ్యంతరంగా వెళ్లొచ్చని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.
తాడిపత్రిలోకి తనను అనుమతించడం లేదంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ పిటిషన్‌లో పేర్కొన్నారాయన. ఈ పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ‘‘మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారు?’’ అంటూ పెద్దారెడ్డిని ప్రశ్నించింది.
హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ.. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అవసరమైన భద్రత కల్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకోవచ్చని పెద్దారెడ్డికి కోర్టు సూచించింది. ఈ క్రమంలో.. పోలీసు సెక్యూరిటీ అవసరమైన ఖర్చు భరించేందుకు పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు అంగీకరించారు.
14 నెలలుగా దూరం
ఏపీలో కిందటి ఏడాది అసెంబ్లీ ఎన్నికల వేళ.. తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలింగ్ తర్వాత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి టీడీపీ జెండా ఎగరేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అంటే దాదాపు 14 నెలలుగా.. ఆయన తాడిపత్రిలో అడుగుపెట్టలేకపోతున్నారు.
తాడిపత్రి వెళ్లాలనుకున్న ప్రతీసారి పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకుంటూ వస్తున్నారు. జేసీ ఒత్తిళ్ల వల్లే పోలీసులు తనను అడ్డుకుంటున్నారని పెద్దారెడ్డి, ఇటు వైఎస్సార్‌సీపీ విమర్శిస్తూ వస్తోంది. ఈ క్రమంలో.. హైకోర్టులో పెద్దారెడ్డికి భారీ ఊరట లభించింది. తాడిపత్రికి వెళ్లేందుకు నిబంధనలతో కూడిన అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ పోలీసులు ఆయనకు సహకరించకుండా వచ్చారు.
దీంతో పెద్దారెడ్డి హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పోలీసుల నుంచి వివరణ కోరింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పెద్దారెడ్డిని రానివ్వడం లేదని అనంత ఎస్పీ పిటిషన్ వివరణ ఇచ్చుకున్నారు. దీంతో.. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన అనుమతిని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి అనుమతిని రద్దు చేస్తూ విచారణ వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే.. ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించి ఇప్పుడు ఊరట దక్కించుకున్నారు.
