
సాక్షి, అనంతపురం: తాడిపత్రి పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఈ క్రమంలో ఇవాళ మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
మంగళవారం ఉదయం తన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే ఆయన్ని బుక్కాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓవరాక్షన్‌కు దిగారు. అడ్డంగా రోడ్డుకు జీపులు పెట్టి మరీ ఆయన్ని ఆపే ప్రయత్నం చేశారు. హైకోర్టు ఆదేశాలున్నా ఎందుకు ఇలా చేస్తున్నారంటూ పెద్దారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
మరోవైపు.. దమ్ముంటే పెద్దారెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టాలంటూ జేసీ ప్రభాకర్ సవాల్ విసురుతున్న సంగతి తెలిసిందే. అయితే పెద్దారెడ్డి అడుగుపెట్టిన వెంటనే దాడులు చేయాలని జేసీ, ఆయన అనుచరులు ప్లాన్ వేశారని వైఎస్సార్‌సీపీ అంటోంది. ఉన్నత న్యాయస్థానం పెద్దారెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు అనుమతించినా.. పోలీసులు అడ్డుకుంటున్న తీరుపై పార్టీ మండిపడుతోంది.