
పరికరాలు లేక .. పనులు సాగక
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు పరికరాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఉపాధి కూలీల ఇబ్బందులు దూరం చేసే దిశగా సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని కూలీలు మండిపడుతున్నారు.
● ఇబ్బందుల్లో ఉపాధి కూలీలు
● పట్టించుకోని కూటమి సర్కారు
● అలవెన్సులు అందుబాటులోకి తేవాలని డిమాండ్
రాయదుర్గం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు ప్రత్యేక అలవెన్సులతో పాటు పరికరాల పంపిణీ ప్రక్రియ కనుమరుగైంది. పార, పలుగు, నీరు, తట్టలు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు లాంటి సౌకర్యాలు దూరమయ్యాయి. కేటాయించాల్సిన ప్రత్యేక అలవెన్సులు ఆగిపోయాయి. ఫలితంగా మొద్దుబారిన పరికరాలతో పనులు సాగక .. కొత్తవి కొనుగోలుకు డబ్బుల్లేక ఉపాధి కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.
కనీస సౌకర్యాలూ కరువే
జిల్లాలోని 31 మండలాల్లో 2.60 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, 4.26 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. ఏటా 1.15 కోట్లకు పైగా పనిదినాలు పూర్తి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం మంజూరయ్యే నిధుల్లో కూలీల వేతనాలకు 60 శాతం పోను మిగిలిన 40 శాతం నిధులతో కూలీలకు అవసరమైన పార, పలుగు, తట్టలు, నీడ కోసం టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు కొనుగోలు చేయాల్సి ఉంది. ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) సర్వర్‌ను అందుబాటులోకి తెచ్చిన తర్వాత ప్రత్యేక అలవెన్సులకు మంగళం పాడింది. ప్రస్తుతం పని ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ప్రథమ చికిత్స కిట్లు సైతం అందుబాటులో లేవు.
తీరని కూలీల అవసరాలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భవన నిర్మాణాలు, సీసీరోడ్లు ఇతర అభివృద్ధి పనులకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించి కూలీల సంక్షేమానికి అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీట వేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు కావస్తున్నా కనీస అవసరాలు తీరక ఉపాధి కూలీలు నానా ఇక్కట్లు పడుతున్నారు. గతంలో ఒక మేట్ పరిధిలో 10 నుంచి 20 మంది లోపు మాత్రమే ఓ గ్రూపుగా పనిచేసేవారు. కూటమి ప్రభుత్వం కొత్తగా శ్రమశక్తి సంఘాల్ని అమల్లోకి తీసుకొచ్చి 30 నుంచి 40 మందిని గ్రూపులుగా చేర్చింది. దీంతో మస్టర్ భారం పెరిగి క్షేత్ర స్థాయి సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.