
విద్యార్థుల గొంతు నొక్కేందుకే జీఓ
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలల్లో సమస్యలు వెలుగులోకి రాకుండా విద్యార్థుల గొంతు నొక్కేలా కూటమి ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మండిపడ్డారు. పాఠశాల్లోకి విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు ప్రవేశించకుండా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను నగరంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరాయుడు, కుళ్లాయిస్వామి మాట్లాడారు. విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలు వెలుగులోకి వస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే భయంతో కూటమి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థి హక్కులపై దాడిగా భావించాల్సి వస్తున్న ఈ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మంజునాథ్, నాని, సమీర్, తరుణకార్తీక్, యశ్వంత్, అక్బర్, సురేష్, ఉమేష్, భీమేష్ పాల్గొన్నారు.
విద్యను నిర్వీర్యం చేసేందుకే
లోకేష్‌కు మంత్రి పదవి : ఏఐవీబీ
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడానికే నారా లోకేష్‌కు విద్యాశాఖ మంత్రి పదవి కట్టబెట్టారని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏఐవీబీ) జిల్లా ప్రధానకార్యదర్శి పృథ్వీ ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీ సభ్యులు తప్ప ఇతరులెవరూ పాఠశాలల్లోకి వెళ్లకుండా నిషేధించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. విలీనం పేరుతో అనేక ప్రాథమిక పాఠశాలలను అన్యాయంగా మూసేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను జైళ్లల్లా మార్చడమే మంత్రి లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. విద్యార్థుల గొంతు నొక్కాలని చూస్తే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అసంబంద్ధ జీఓను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు ఇంతియాజ్, నరేంద్ర పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఉత్తర్వుల దగ్ధం