
5న సర్పంచుల ‘చలో విజయవాడ’
గుంతకల్లు రూరల్: ఏడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,121 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని జిల్లా సర్పంచుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు చెల్లించకుండా కూటమి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఈ నెల 5న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. గుంతకల్లు మండలంలోని తన సొంత పంచాయతీ ఓబుళాపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడు నెలల క్రితం గ్రామ పంచాయతీలకు గత డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1121 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెట్టడంతో పంచాయతీల పరిధిలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గడిచిన వేసవిలో తీవ్రమైన తాగునీటి ఇబ్బందులతో ప్రజలు అవస్థలు పడితే, ప్రస్తుత వర్షాకాలంలో పారిశుద్ధ్య లోపంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కార్మికుల జీతభత్యాలు కూడా చెల్లించలేని స్థితిలో పంచాయతీలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జగన్ సర్కార్ గ్రామ పంచాయతీలను, స్థానిక సంస్థలను నిర్లక్ష్యం చేసిందని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు మాట్లాడటం జరిగిందని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరు చేస్తుందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు గౌరవ వేతనాన్ని పెంచాలని, ఉపాధి పథకం ద్వారా గ్రామ పంచాయతీల్లో పనులు నిర్వహించాలని, ఎన్నికల హామీల్లో భాగంగా ఐదవ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి పంచాయతీలకు నిధులను కేటాయించాలని, పంచాయతీలకు అందాల్సిన సర్ చార్జీలను నిరంతరం విడుదల చేయాలనే డిమాండ్ల సాధన కోసం ఈ నెల 5న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి సర్పంచులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు.
సర్పంచుల సంక్షేమ సంఘం
జిల్లా అధ్యక్షుడు రమేష్‌రెడ్డి