
‘సమగ్ర’ పీటీఐలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష ద్వారా పాఠశాలల్లో పని చేస్తున్న పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లకు (పీటీఐ) ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ పీటీఐల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సైకం శివకుమారి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కృష్ణకళామందిరంలో పీటీఐల ఉమ్మడి జిల్లా అసోసియేషన్ మహాసభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షురాలు శివకుమారి మాట్లాడుతూజజ 13 ఏళ్లుగా రెగ్యులర్ టీచర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న పీటీఐలు ఇప్పటి వరకూ కనీస వేతనాలకు నోచుకోవడం లేదన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. మహాసభలో ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్, ప్రధానకార్యదర్శి పీఎస్ ఖాన్, మహిళా విభాగం చైర్‌పర్సన్ సురేఖరావు, పీటీఐల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, శ్రీదేవి, ప్రభాకర్, విజయకుమారి, సౌజన్య, రాజేంద్ర పాల్గొన్నారు.
మహిళ దారుణ హత్య
పరిగి: కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. పోలీసులు తెలిపిన మేరకు.. రొద్దం మండలం తురకలాపట్నానికి చెందిన అంజప్పకు మడకశిర మండలం చందకచెర్లు గ్రామానికి చెందిన సన్నక్క (50)తో వివాహమైంది. అయితే ఇటీవల దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో సన్నక్క భర్త నుంచి వేరుగా ఉంటోంది. ఏమైందో తెలియదు కానీ శనివారం రాత్రి పరిగి మండలం కొడిగెనహళ్లి పంచాయతీ బిందూనగర్ సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల వెనుక మైదానంలో హత్యకు గురైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పరిగి పోలీసులు ఆదివారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. భర్త అంజప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.