
యువకుడి బలవన్మరణం
గుమ్మఘట్ట: తాగుడకు బానిసైన ఓ యువకుడు వ్యసనాన్ని మానలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుమ్మఘట్ట మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన హరిజన తిప్పేస్వామి, గీతమ్మ దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. వ్యవసాయంతో జీవనం సాగించేవారు. పెద్ద కుమారుడికి వివాహమైంది. ఈ క్రమంలో రెండో కుమారుడు రాజ్‌కుమార్ (24)కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఏ ఒక్కటీ కుదరకపోవడంతో రాజ్‌కుమార్ తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో పలుమార్లు తల్లిదండ్రులు మందలించినా అతనిలో మార్పు రాలేదు. తాగుడుకు బానిసైన తనకు ఇక పెళ్లి కాదని భావనలో క్షణికావేశానికి లోనై శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు రాయదుర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక రాజ్‌కుమార్ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రంపం కోసుకుని
వ్యక్తికి తీవ్ర గాయాలు
గుత్తి: ప్రమాదశాత్తు రంపం కోసుకుని ఖాసీం వలి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన గుత్తి ఆర్‌ఎస్‌లోని బీసీ కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. తన ఇంటికి వేసిన రేకులను సరి చేయడానికి రంపంతో కోస్తుండగా చేజారి పొట్టపై పడింది. ఎలక్ట్రిక్ రంపం కావడంతో పొట్ట కోసుకుపోయింది. విపరీతంగా రక్తస్రావం అవుతుండడంతో క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇన్నోవేషన్ సెంటర్‌లో
ఉద్యోగాల భర్తీకి చర్యలు
అనంతపురం అర్బన్ : జేఎన్‌టీయూలో ఏర్పాటు చేయనున్న రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్‌లో ఉద్యోగాల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్‌శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌కు తెలిపారు. సెంటర్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు. ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్న జిల్లాల కలెక్టర్లతో ఐటీ కార్యదర్శి శుక్రవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఆయనతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, ఇతర అధికారులు ఉన్నారు. సెంటర్ గురించి పరిశ్రమలు, విద్యాసంస్థలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మురళీకృష్ణ, డీఈ వి.రాజగోపాల్, నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రతాపరెడ్డి, ఆర్‌అండ్‌బీ జేసీ బాలకాటమయ్య, తదితరులు పాల్గొన్నారు.
తేలు కుట్టి యువకుడి మృతి
గుంతకల్లు రూరల్: మండలంలోని దంచర్ల గ్రామానికి చెందిన కొట్టం రామాంజనేయులు కుమారుడు శివ (30) తేలు కుట్టడంతో మృతిచెందాడు. వ్యవసాయ పనులతో కుటుంబానికి చేదోడుగా ఉన్న శివకు 18 నెలల క్రితం వివాహమైంది. శుక్రవారం పొలం పనులు చేస్తున్న సమయంలో తేలు కుట్టింది. గుర్తించిన బాధితుడు వెంటనే తేలును చంపేశాడు. నొప్పి ఎక్కువగా ఉండడంతో ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు తెలపడంతో వారు గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స అందేలోపు శివ మృతి చెందాడు.

యువకుడి బలవన్మరణం