దయనీయంగా రైతుల పరిస్థితి | - | Sakshi
Sakshi News home page

దయనీయంగా రైతుల పరిస్థితి

Aug 5 2025 6:30 AM | Updated on Aug 5 2025 6:30 AM

దయనీయంగా రైతుల పరిస్థితి

దయనీయంగా రైతుల పరిస్థితి

అనంతపురం అర్బన్‌: కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఆయన సోమవారం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో కలిసి ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మకు కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘అన్నదాత సుఖీభవ’ కింద పెట్టుబడి సాయం రూ.20 వేలను గత ఏడాది కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందని మండిపడ్డారు. రెండేళ్లకురూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 వేలు ఇచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 2,94,353 మంది రైతులకు ‘భరోసా’ అందిస్తే కూటమి ప్రభుత్వం 2,75,642 మంది రైతులనే అర్హులుగా తేల్చిందన్నారు. 18,711 మందికి కోత పెట్టడం అన్యాయమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రభుతమే బీమా ప్రీమియం చెల్లించడంతో పాటు ఏటా జూలైలోనే పెద్ద ఎత్తున పరిహారమూ అందజేశామన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఉచిత బీమా పథకాన్ని రద్దు చేసి బీమా పథకాల లబ్ధి అందని ద్రాక్షగా మార్చారన్నారు. గత ఏడాది అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినా బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ వర్షాలు లేవన్నారు. ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 8.50 లక్షలు ఎకరాలు కాగా 3.26 లక్షలు ఎకరాలు మాత్రమే పంటలు సాగయ్యాయన్నారు.

అధిక ధరలకు యూరియా..

యూరియా, డీఏపీని వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారని ‘అనంత’ మండిపడ్డారు. కాంప్లెక్స్‌ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామంటూ ఇబ్బంది పెడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఇంత వరకు వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించలేదన్నారు.

చీనీ రైతుల కష్టాలు..

కూటమి ప్రభుత్వంలో చీనీ రైతులకూ కష్టాలు తప్పడం లేదన్నారు. గతంలో టన్ను రూ.40 వేలు ఉండగా ఇప్పుడు టన్ను రూ.20 వేలకు మించడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో చీనీ రైతులకు పంటల బీమా ద్వారా పెద్ద ఎత్తున్న పరిహారం అందజేశామని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. హెచ్‌ఎల్‌సీ, హంద్రీ–నీవా ద్వారా నీటి విడుదల నేపథ్యంలో ఇరిగేషన్‌ అడ్వయిజరీ బోర్డు సమావేశం నిర్వహించి నీటి కేటాయింపులు చేయాలన్నారు. హెచ్‌ఎల్‌సీ ఉత్తర, దక్షిణ కాలువకు నీరు విడుదల చేయాలన్నారు. జిల్లా నుంచి ప్రజలు వలసలు వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏరాసి నారాయణరెడ్డి, అనుబంధ విభాగాల జిల్లా ఇన్‌చార్జ్‌ ఉదయ్‌కుమార్‌, రైతు విభాగం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేంద్రరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిది భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, సంయుక్త కార్యదరిశ పెన్నం శివారెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్లయ్య, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జానీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూలు శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నీలం భాస్కర్‌, గ్రీవెన్స్‌ సెల్‌ శింగనమల నియోజకవర్గం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, వైసీపీ నాయకులు చెన్నంపల్లి వెంకటరెడ్డి, కొత్తపల్లి నాగలింగారెడ్డి, పురుషోత్తం, శ్రీనివాసులు, సుంకిరెడ్డి, నారాయణస్వామి, కసిరెడ్డి కేశవరెడ్డి, జగదీష్‌, పాటిల్‌ తిమ్మారెడ్డి పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

అనంత వెంకటరామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement