
జల్లెడ పడుతున్నా జాడ లేదు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: హిందూపురం పట్టణంలోని ఎస్‌బీఐలో జరిగిన భారీ దోపిడీ కేసు పోలీసులకు సవాలుగా మారింది. సుమారు 11 కేజీలకు పైగా బంగారం (రూ.11 కోట్ల విలువ), రూ.30 లక్షల నగదు దోచుకుని వెళ్లి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకూ కనీసం చిన్న ఆధారాన్ని కూడా సేకరించలేక పోయారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పాటు అనంతపురం నుంచి మూడు బృందాల పోలీసులు, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మూడు బృందాలు నాలుగు రోజులుగా జల్లెడ పడుతున్నా ఎక్కడా జాడ కూడా తెలియలేదు.
ఆనవాళ్లు దొరక్కుండా..
ఎంత తెలివైన దొంగలైనా ఎక్కడో ఒక చోట చిన్న తప్పు చేసి దొరికిపోతుంటారు. ఫింగర్ ప్రింట్స్ లోనో, సెల్‌ఫోన్ లొకేషన్ వల్లో చిక్కేస్తుంటారు. కానీ హిందూపురం ఎస్‌బీఐ దోపిడీ ఘటనలో దొంగలు అత్యంత జాగ్రత్త పడ్డారు. నేరస్తుడు ఎలక్ట్రికల్ పనిలో నిష్ణాతుడైనట్లు తెలుస్తోంది. ఫేజ్, న్యూట్రల్, ఎర్త్, ఇన్వర్టర్ కనెక్షన్ ఇలా అన్ని వైర్లనూ చాలా జాగ్రత్తగా కట్ చేశారు. సీసీ కెమెరా కనెక్షన్ మొదట్లోనే తొలగించారు. వెంట తెచ్చుకున్న మినీ గ్యాస్ సిలిండర్ నుంచి కట్టర్‌ను ఉపయోగించి కిటీకీ ఇనుప చువ్వలు కత్తిరించారు. ముఖానికి మాస్కు, కాళ్లకు సాక్సు, చేతులకు గ్లౌజులు వేసుకుని అత్యంత పకడ్బందీగా లాకర్లను కట్ చేసి 11 కేజీలకు పైగా బంగారాన్ని దోచుకెళ్లారు. ఎక్కడా వేలిముద్రలు, పాదముద్రలు పడకుండా జాగ్రత్త పడినట్టు తెలిసింది. దోపిడీకి ఇద్దరు దొంగలు మాత్రమే వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు బ్యాంకు ఆవరణలో వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించినట్టు గుర్తించారు. తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటలలోగా దోపిడీ జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.
ఘోరంగా విఫలం..
బ్యాంకు దోపిడీ దొంగలను పట్టుకునేందుకు వారం రోజులుగా పోలీసులు జల్లెడ పడుతున్నా ఎక్కడా ఆచూకీ లేదు. ప్రధానంగా సెల్ ఫోన్ వాడటం లేదని తెలిసింది. దొంగలు ఇతర రాష్ట్రానికి చెందిన వారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరు, నెల్లూరు, హైదరాబాద్‌తో పాటు అనుమానం వచ్చిన చోటల్లా గాలిస్తున్నా జాడ దొరకలేదు. పుట్టపర్తి పోలీసులకు ఈ విషయం పెద్ద సవాలుగా మారింది. ఇదే కాదు చాలాచోట్ల దొంగతనాలు జరుగుతున్నా దొంగలను పట్టుకోవడంలో శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలూ ఉన్నాయి. జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయని, రికవరీలు తక్కువగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల తీరుతో సామాన్య ప్రజలకు మాత్రం ఆవేదనే మిగులుతోంది. బ్యాంకు లాకర్లలో బంగారం పెట్టినా దొంగిలిస్తుంటే ఏం చేయాలంటూ ఖాతాదారులు వాపోతున్నారు.
హిందూపురం బ్యాంకు
దోపిడీ కేసులో కనిపించని పురోగతి
మూడు బృందాలు గాలిస్తున్నా
చిన్న క్లూ కూడా దొరకని వైనం
చోరీల కట్టడిలో శ్రీసత్యసాయి
పోలీసులు విఫలమయ్యారని విమర్శలు