
ఈ సెల్‌ఫోన్లు మాకొద్దు
● జిల్లా వ్యాప్తంగా సీడీపీఓలకు
తిరిగిచ్చేసిన అంగన్‌వాడీలు
అనంతపురం సెంట్రల్/రాప్తాడు రూరల్: ‘ఈ సెల్‌ఫోన్లు మాకొద్దు బాబోయ్’ అంటూ అంగన్‌వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టు సీడీపీఓలకు సెల్‌ఫోన్లు తిరిగిచ్చేశారు. జిల్లాలో 2,302 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. గతంలో ప్రతి కేంద్రానికీ స్మార్ట్‌ఫోన్ అందించారు. చిన్నారులు, గర్భిణుల హాజరుతోపాటు వారికి అందిస్తున్న పౌష్టికాహారం, ఇతరత్రా కార్యక్రమాల వివరాలను వీటి ద్వారానే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే సెల్‌ఫోన్లు సరిగా పనిచేయడం లేదని అంగన్ వాడీలు ఫిర్యాదులు చేస్తున్నా స్పందన కరువైంది. ఇటీవల పని ఒత్తిడి మరింత ఎక్కువ కావడంతో తాము ఇక భరించలేమంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు సెల్‌ఫోన్లను తిరిగిచ్చేశారు. అనంతపురం అర్బన్ మినహా జిల్లాలో అన్ని ప్రాజెక్టుల్లో సోమవారం అధికారులకు అప్పగించారు. అయితే సెల్‌ఫోన్లు తీసుకోవడానికి కొందరు సీడీపీఓలు, అధికారులు నిరాకరించగా.. అంగన్‌వాడీ సిబ్బంది మాత్రం సెల్‌ఫోన్లు మాకొద్దు అంటూ స్పష్టం చేశారు.
పని చేయలేకపోతున్నాం
ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్లు సరిగా పనిచేయడం లేదు. ఒక్కో పనికి గంటల పాటు సమయం పడుతుండడంతో అంగన్‌వాడీ వర్కర్లు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక రాష్ట్రంలో ఐదారుగురు బలవన్మరణాలకు కూడా పాల్పడ్డారు. కొత్త ఫోన్లు ఇచ్చే వరకూ ఆన్‌లైన్ చేయం అని స్పష్టంగా తెలియజేసి వెనక్కు ఇచ్చాం.
– రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి,
అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్
త్వరలో కొత్త ఫోన్లు మంజూరు
సెల్‌ఫోన్లు మొరాయిస్తున్నాయని గతంలోనే రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఈనెలాఖరులోగా కొత్త సెల్‌ఫోన్లు వస్తాయని తెలుస్తోంది. అంతవరకూ ఆన్‌లైన్ ద్వారా సేవలందించాలని అంగన్‌వాడీ వర్కర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. వారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాం.
– నాగమణి, ప్రాజెక్టు డైరెక్టర్, ఐసీడీఎస్