
ఎరువులు.. పడరాని పాట్లు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో ఎరువుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పంటల సాగు విస్తీర్ణం తక్కువగా ఉన్నా... ఎరువుల సమస్య నెలకొనడం గమనార్హం. ప్రధానంగా యూరియా దొరకడం లేదని రైతులు చెబుతున్నారు. వరి, వేరుశనగ, మొక్కజొన్న, ఆముదం తదితర పంటల కోసం రైతులు ఎగబడుతున్నా బస్తా యూరియా కూడా లభించే పరిస్థితి లేదంటున్నారు. వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ అధికారులు మాత్రం తగినంత నిల్వ ఉన్నట్లు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతానికి డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల సమస్య లేకున్నా యూరియా నిల్వలు మాత్రం పూర్తిగా ఖాళీ అయినట్లు రీటైల్, హోల్‌సేల్ డీలర్లు వాపోతున్నారు. పొటాష్ కూడా తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా యూరియా సరఫరా నిలిపివేసినట్లు సమాచారం. కొన్ని కంపెనీల నుంచి కోటా మేరకు ఎరువుల సరఫరా సక్రమంగా కావడం లేదని చెబుతున్నారు.
అప్పట్లో ఎన్నడూ ఇలా లేదు..
గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు జిల్లా అంతటా మంచి వర్షాలతో పంటల సాగు అధికంగా ఉన్నా ఎన్నడూ ఎరువుల సమస్య ఉత్పన్నం కాలేదు. నెలవారీ కోటా మేరకు ఎరువులు సరఫరా కావడం, ఆర్‌బీకేలు, డీసీఎంఎస్, పీఏసీఎస్ లాంటి సొసైటీల్లో కూడా పెద్ద ఎత్తున నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవడంతో రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. కానీ కూటమి సర్కారు వచ్చాక ఎరువుల కోటా నామమాత్రం చేయడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది.
అధిక ధరలు..
ఖరీఫ్‌లో జిల్లాకు 1.08 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు కేటాయించారు. అందులో 27 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 19 వేల మెట్రిక్ టన్నులు డీఏపీ, 4,700 మెట్రిక్ టన్నులు ఎంఓపీ, 4 వేల మెట్రిక్ టన్నులు ఎస్‌ఎస్‌పీ కాగా అత్యధికంగా 53 వేల మెట్రిక్ టన్నులు వివిధ కాంప్లెక్స్ ఎరువులు కేటాయించారు. కాంప్లెక్స్ ఎరువులు తగినంత సరఫరా అవుతున్నా యూరియా సరఫరా మందకొడిగా ఉంది. ఆరు మండలాల రైతులను ఆదుకుంటున్న స్థానిక డీసీఎంఎస్‌లో నాలుగు రోజులుగా యూరియా బంద్ కావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో అక్కడక్కడా యూరియా ఎంఆర్‌పీకి మించి అధిక ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం.
యూరియా కోసం బారులు
బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహాళ్ గ్రామంలోని సహకార సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు.సోమవారం ఉదయమే పెద్ద సంఖ్యలో రైతులు వచ్చారు. చంటి బిడ్డలున్న మహిళలు కూడా క్యూలో నిల్చోవ డాన్ని బట్టి క్షేత్రస్థాయిలో ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు అర్థం చేసుకోవచ్చు.