
ఈ పోస్టు... చాలా ‘రేటు’!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్ ఏదైనా ఉంది అంటే అది అనంతపురం నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషనే. గొలుసు దొంగలు, మట్కారాయుళ్లు, రౌడీషీటర్లు, గంజాయి బ్యాచ్, భూ కబ్జాలు ఇలా ఒకటేమిటి నిత్యం బాధితులతో ఈ స్టేషన్ కిటకిటలాడుతుంటుంది. అలాంటి స్టేషన్‌కు నెలన్నర రోజులుగా సీఐని నియమించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిత్యం వందల సంఖ్యలో బాధితులు స్టేషన్‌కు వస్తుంటారు.. వారి సమస్యలు పరిష్కరించాలనే కనీస ఆలోచన కూడా లేకుండా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తుండడం గమనార్హం.
రాయ‘బేరాలు’...
వన్‌టౌన్ సీఐ పోస్టుకు టీడీపీ నేతలు బేరం పెట్టినట్లు తెలిసింది. రూ.15 లక్షల వరకూ పలుకుతోందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.డబ్బు ఇవ్వకుంటే పోస్టింగ్ ఇచ్చేది లేదంటూ అధికార పార్టీ నేతలు తెగేసి చెబుతున్నారని, బేరం కుదరకపోవడంతోనే నెలన్నర రోజులుగా సీఐని నియమించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సీఐలు అంత డబ్బు చెల్లించలేక వన్‌టౌన్‌కు రావడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో డబ్బు చెల్లించేదెవరు.. పోస్టింగ్ తెచ్చుకునేదెవరన్న విషయంపై పోలీసు వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. రాజకీయ ఒత్తిళ్లతో ఉన్నతాధికారులు కూడా ఎటూ తేల్చని దుస్థితి నెలకొనడం గమనార్హం.
రాజేంద్ర యాదవ్ సస్పెన్షన్ తర్వాత..
నెలన్నర క్రితం తన్మయి అనే ఇంటర్ విద్యార్థిని హత్య జరిగింది. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా సీఐ రాజేంద్రనాథ్ యాదవ్‌ను సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి వన్‌టౌన్ స్టేషన్‌కు సీఐ లేరు. రాజేంద్రనాథ్‌యాదవ్ కూడా అప్పట్లో టీడీపీ నాయకుల ద్వారానే ఈ స్టేషన్‌కు వచ్చారు.
టూటౌన్ సీఐకి ఇన్‌చార్జ్ ఇచ్చినా..
రాజేంద్రనాథ్ సస్పెన్షన్ తర్వాత టూటౌన్ సీఐ శ్రీకాంత్‌కు వన్‌టౌన్ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. కానీ రెండు స్టేషన్లు చూడటం ఆయన వల్ల కావడం లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం వన్‌టౌన్ ఎస్‌ఐగా ఉన్న వ్యక్తి బాధితుల సమస్యలు పరిష్కరించడం కన్నా భూముల పంచాయితీలు ఎక్కువగా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అనంత వన్‌టౌన్ సీఐ పోస్టుకు
టీడీపీ నేతల బేరం!
పోలీసు ఉన్నతాధికారుల
మౌనంపై సర్వత్రా చర్చ