
15 వరకు ‘హర్ ఘర్ తిరంగ’
● ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
అనంతపురం అర్బన్: ‘‘అజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈనెల 15 వరకు హర్ ఘర్ తిరంగ ప్రచారాన్ని ఘనంగా నిర్వహించాలి. నిర్దేశించిన విధంగా కార్యక్రమాలు చేపట్టాలి’ అని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలతో సమన్వయం కోసం జిల్లా పర్యాటక అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రామ, మండల, జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. 13న తిరంగ ర్యాలీలతో పాటు స్వాతంత్య్ర సమరయోధులు, వారి కుటుంబాలను సన్మానించాలని, మునిసిపల్ కమిషనర్లు ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పారు. ప్రధాన ప్రదేశాల్లో దేశభక్తి గీతాలు, తిరంగ యాత్రలు నిర్వహించాలన్నారు. 14న జిల్లాస్థాయి నుంచి గ్రామ, వార్డు స్థాయి వరకు తిరంగ యాత్ర నిర్వహించాలని డీపీఓని ఆదేశించారు. 15న అన్ని విభాగాలు జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పనులు పెండింగ్ ఉంచొద్దు
అనంతపురం అర్బన్: ‘గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి అంశాలు పెండింగ్ ఉండకూడదు. వాటిని సత్వరమే పూర్తి చేయాలి. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై చర్యలు ఉంటాయి. నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఉన్న అధికారులకు మెమోలు జారీ చేయండి’ అని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి డీపీఓ, డీఎల్‌డీఓ, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, ఈఓఆర్‌డీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. సచివాలయాల్లో క్యూఆర్ కోడ్ ఉంచి ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని చెప్పారు. పనుల్లో రోజూ పురోగతి కనిపించాలన్నారు. నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఉన్న మండలాలను గుర్తించి ఆయా ఎంపీడీఓలకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ‘తల్లికి వందనం’ ఫిర్యాదులు రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదనే ఫిర్యాదులు చాలా మండలాల నుంచి వస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, సీపీఓ అశోక్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ శివశంకర్, డీపీఓ నాగరాజునాయుడు, హౌసింగ్ పీడీ శైలజ, జీఎస్‌డబ్ల్యూఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
బూతులు తిట్టి..
స్టేషన్‌లో కూర్చోబెట్టి!
● దళిత కుటుంబంపై
బ్రహ్మసముద్రం ఎస్‌ఐ దాష్టీకం
బ్రహ్మసముద్రం: న్యాయం చేయమని వచ్చిన తమను ఎస్‌ఐ నానా బూతులు తిట్టడమే కాకుండా పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టారని ఓ దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధితులు తెలిపిన మేరకు.. బ్రహ్మసముద్రం మండలం బొబ్బర్లపల్లికి చెందిన మారెన్న కుమార్తె పొలంలోని వేరుశనగ పంటను ఆదివారం కొందరు గొర్రెలతో మేపారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు బ్రహ్మ సముద్రం పోలీసుస్టేషన్‌కు వెళ్లగా.. ఎస్‌ఐ నరేంద్రకుమార్ న్యాయం చేస్తామని చెప్పి ఆమెను వెనక్కి పంపారు. సోమవారం ఆమె మళ్లీ తన భర్తతో పాటు తండ్రి మారెన్నతో కలిసి పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే వారిపై ఎస్‌ఐ నరేంద్ర కుమార్ రెచ్చిపోయారు. తప్పుడు కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నానా బూతులు తిట్టారు. న్యాయం చేయాలని కోరితే ఇలా మాట్లాడడం తగదని మారెన్న అనగా.. ఎస్‌ఐ మరింత రెచ్చిపోయారు. నువ్వెవరు తప్పుడు నా కొ.. అంటూ దాష్టీకం ప్రదర్శించారు. మారెన్నతో పాటు ఆయన కుమార్తె, ఆమె భర్తను స్టేషన్‌లో కూర్చోబెట్టారు. పెద్ద మనిషిగా వచ్చిన తనను ఎందుకు కూర్చోమంటున్నారని మారెన్న అంటే.. అన్నీ నీకు చెప్పాలా అంటూ తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ సాయంత్రమైనా ఎస్‌ఐ తిరిగి రాకపోవడంతో బాధిత దళిత కుటుంబం పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపింది. దళితులమైన తమ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన ఎస్‌ఐపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మారెన్న కోరుతున్నారు.

15 వరకు ‘హర్ ఘర్ తిరంగ’