పాపం పసివాడు | - | Sakshi
Sakshi News home page

పాపం పసివాడు

Aug 6 2025 6:36 AM | Updated on Aug 6 2025 6:36 AM

పాపం పసివాడు

పాపం పసివాడు

మైదుకూరు: తల్లి మందలించిందనే బాధతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన బాలుడు.. మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో సెల్‌ ఫోన్‌ దొంగలించాడనే అపవాదును ఎదుర్కొని చివరికి స్థానిక ఆర్టీసీ అధికారి చొరవతో నిర్దోషిగా తేలి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరిన ఘటన ఇది. గుత్తికి చెందిన దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. 12 ఏళ్ల ఈ బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. సోమవారం భార్యభర్తలు ఇరువురు ఇంట్లో గొడవ పడ్డారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కుమారుడిపై తల్లి గట్టిగా కేకలు వేసింది. తల్లి మందలించడంతో బాధపడిన బాలుడు ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు. మంగళవారం ఉదయం మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో కర్నూలు–తిరుపతి సర్వీసు బస్సులో డబ్బుల కోసం ప్రయాణికులను యాచిస్తున్నాడు. అదే సమయంలో మైదుకూరుకు చెందిన ఖాజా అనే వ్యక్తి తిరుపతి వెళ్లేందుకు అదే బస్సు ఎక్కాడు. కొంత సేపటికి తన సెల్‌ ఫోన్‌ కనిపించలేదని హడావుడి చేసిన ఖాజా తన సెల్‌ఫోన్‌ను దొంగలించాడని ఆ పిల్లవాణ్ణి పట్టుకున్నాడు. తాను దొంగలించలేదని, తాను దొంగను కాదని బాలుడు ఏడుస్తూ చెప్పాడు. సెల్‌ ఫోన్‌ను దొంగలించి ఇంకొకరికి ఇచ్చి పంపావు అంటూ ఖాజా బాలుడిని బస్సు నుంచి కిందకు దించి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అది గమనించిన మైదుకూరు డిపోకు చెందిన జనరల్‌ ఏడీసీ ఎం.లక్ష్మయ్య స్టేషన్‌కు చేరుకుని బాలుడితో మాట్లాడారు. బాలుడు చెప్పినదంతా విని ఈ అబ్బాయి సెల్‌ఫోన్‌ దొంగలించి ఉండడని అన్నారు. బాధితునితో సెల్‌ నంబర్‌ను చెప్పించుకుని ఆ నంబర్‌కు ఫోన్‌ చేశారు. ఖాజా సెల్‌ ఫోన్‌ను కర్నూలు–తిరుపతి బస్సులో ఉన్న ఓ వ్యక్తి ఎత్తి మాట్లాడాడు. ఎవరిదో సెల్‌ ఫోన్‌ సీట్‌పై పడి ఉండగా తీసి తన వద్ద ఉంచుకున్నట్టు ఆ వ్యక్తి చెప్పాడు. అది మైదుకూరుకు చెందిన ఓ వ్యక్తిదని, దానిని కడప బస్టాండ్‌లోని ఎంకై ్వరీ వద్ద డ్యూటీలో ఉన్న వంశీ అనే వ్యక్తికి అందజేయాలని ఏడీసీ లక్ష్మయ్య కోరారు. ఫోన్‌ బస్సులో జారి పడగా చూసుకోకుండా బాలుడిపై అనవసరంగా నిందలు వేసినందుకు పోలీసులు ఖాజాను మందలించి పంపారు. అనంతరం ఏడీసీ లక్ష్మయ్య బాలుడిని వెంటబెట్టుకుని హోటల్‌కు తీసుకెళ్లి టిఫిన్‌ తినిపించారు. తర్వాత బాలుడి తల్లి నంబర్‌ తీసుకొని ఆమెతో సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. ‘మీ అబ్బాయి మైదుకూరులో మా వద్ద క్షేమంగా ఉన్నాడు’ అని చెప్పగా.. ఇంట్లో తాము గొడవ పడి ఆ కోపంతో బాలుడిని మందలించానని ఆమె పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది. తన కుమారుడిని తమ వద్దకు పంపాలని అభ్యర్థించింది. ఆ మేరకు బాలుడిని నెల్లూరు–అనంతపురం సర్వీస్‌ బస్సులో ఎక్కించిన లక్ష్మయ్య టికెట్‌ తీయించి అదనంగా రూ.360ను అతని జేబులో ఉంచారు. సాయంత్రం తన కుమారుడు ఇంటికి చేరుకోగానే తల్లి సంతోషంతో ఏడీసీ లక్ష్మయ్యకు ఫోన్‌ చేసి కృతజ్ఞతలు తెలిపారు. పసిప్రాయంలో ఇంటి నుంచి పారిపోయి వచ్చి జీవితంలో మరిచిపోలేని చేదు జ్ఞాపకాన్ని బాలుడు మిగిల్చుకోగా, బాలుడి పరిస్థితిపై జాలిపడి చొరవ చూపి అతన్ని నిర్దోషిగా తేల్చి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చి మానవత్వాన్ని చూపిన ఆర్టీసీ అధికారి లక్ష్మయ్య అందరి మన్ననలను అందుకున్నారు.

తల్లి మందలించిందని బస్సెక్కి మైదుకూరుకు చేరుకున్న గుత్తి బాలుడు

సెల్‌ఫోన్‌ దొంగిలించాడని స్టేషన్‌కు పట్టుకెళ్లిన ఓ వ్యక్తి

అధికారులు విచారిస్తే బస్సులోనే పోగొట్టుకున్నట్లు వెల్లడి

బాలుడిని కాపాడి తల్లి వద్దకు చేర్చిన ఆర్టీసీ ఏడీసీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement