సరుకులే కాదు.. కార్లు, ఫ్రిజ్‌లు, కూలర్లూ.. | - | Sakshi
Sakshi News home page

సరుకులే కాదు.. కార్లు, ఫ్రిజ్‌లు, కూలర్లూ..

Aug 6 2025 6:36 AM | Updated on Aug 6 2025 7:02 AM

సాక్షి ప్రతినిధి, అనంతపురం: మిలిటరీ క్యాంటీన్‌ అంటే చాలామంది కేవలం నిత్యావసర సరుకులు, లిక్కర్‌ లభించే ప్రదేశమే అనుకుంటారు. అయితే, క్యాంటీన్‌ ద్వారా ఎన్నో సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలియక చాలామంది మాజీ సైనికోద్యోగులు వినియోగించుకోవడం లేదు. శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2,200 మందికి పైగా మాజీ సైనికోద్యోగులు ఉన్నారు. వీరిలో చాలామంది తక్కువ ధరకు లభించే ఖరీదైన వస్తువులను వినియోగించుకోలేక పోతున్నారు. సమాచార లోపం కారణంగా భారీగా రాయితీలు కోల్పోతున్నారు.

కార్లు, టూవీలర్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు కూడా

మాజీ సైనికోద్యోగులు నెలకు ఐదువేల రూపాయలకు వచ్చే సరుకులనే చూస్తున్నారు కానీ మిగతావి చూడటం లేదు. వాస్తవానికి క్యాంటీన్‌తో అవసరం లేకుండా కార్లు, ఫ్రిజ్‌లు, ద్విచక్రవాహనాలు, ఏసీ, ఎల్‌ఈడీ టీవీలు ఇవన్నీ తీసుకోవచ్చు. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని నేరుగా ఇంటికే కారు తెప్పించుకునే అవకాశం ఉంది. ఇందుకోసం మాజీ సైనికోద్యోగి ముందుగా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేయాలి. afd.csdindia.comలో ఒకసారి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే జీవితకాలం ఉంటుంది. కొత్త కార్డు కోసం csdsmartcard.com వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. కారు లేదా టూవీలర్‌ కావాలంటే షోరూంకు వెళ్లి అవైలబిలిటీ సర్టిఫికెట్‌ తెచ్చి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తే అనుమతి వస్తుంది. రమారమి 20 శాతం తక్కువ ధరకు వాహనాలు అందుతాయి. కొన్ని టూవీలర్ల ధరలు 25 శాతం కూడా తగ్గుతాయి.

● ఒకసారి కారు లేదా టూవీలర్‌ తీసుకుంటే మళ్లీ ఐదేళ్ల వరకూ తీసుకోకూడదు. ఆరో ఏట తీసుకోవచ్చు. రెండేళ్ల పాటు బండిని అమ్ముకోకూడదు. తనపేరు మీదే ఉంటుంది. మిగతా ఏ ఖరీదైన వస్తువైనా సరే మూడేళ్లకోసారి తీసుకోవచ్చు. మిక్సీలు, గ్రైండర్లు ఇలా రూ.70 వేల లోపు విలువైనవి ప్రతి నెలా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ రాయితీలు త్రివిధ దళాలు అంటే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ వారికి మాత్రమే వర్తిస్తాయి. బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటివన్నీ పారామిలటరీ కిందకు వస్తాయి. వీరికి వేరే క్యాంటీన్లు ఉంటాయి.

మాజీ సైనికోద్యోగులకు అనేక సౌలభ్యాలు

అవగాహన లేక వినియోగించుకోని వైనం

ఆన్‌లైన్‌లోనే అన్ని కార్యకలాపాలు

సరుకులే కాదు.. కార్లు, ఫ్రిజ్‌లు, కూలర్లూ.. 1
1/1

సరుకులే కాదు.. కార్లు, ఫ్రిజ్‌లు, కూలర్లూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement