
ప్రైవేట్ బ్యాంక్‌లో దొంగలు!
అనంతపురం: ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు నగలను తీసుకెళ్లి మరో ఫైనాన్స్ సంస్థలో కుదువపెట్టి నగదును కాజేస్తున్న ముఠా గుట్టును అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు రట్టు చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ కె.జగదీష్‌తో కలసి అనంతపురం డీఎస్పీ వి.శ్రీనివాసరావు వెల్లడించారు. అనంతపురంలోని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రాంనగర్ బ్రాంచ్‌లో ఖాతాదారుకు చెందిన ఒక గోల్డ్ ప్యాకెట్ ట్యాంపర్ అయింది. ఒరిజినల్ బంగారం స్థానంలో నకిలీ బంగారాన్ని పెట్టినట్లు గుర్తించారు. దీంతో బ్యాంకులో పనిచేస్తున్న వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆ బ్యాంక్ మేనేజర్ పి వేణుగోపాలరెడ్డి ఈ నెల 14న నాల్గో పట్టణ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో కీలకమైన అంశాలను పసిగట్టారు. ఈ క్రమంలో పక్కా ఆధారాలతో అనంతపురంలోని రాణినగర్‌కు చెందిన వి.రామాంజనేయులు కుమారుడు సతీష్ కుమార్, జాకీర్ కొట్టాల ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న నరసింహులు కుమారుడు బోయ హెచ్.జయరాములు, కళ్యాణదుర్గం రోడ్డు రాజా హోటల్ వెనుక గణేష్ నగర్‌లో నివాసం ఉంటున్న నాగరాజు కుమారుడు సాయి కృష్ణ, నందమూరినగర్‌కు చెందిన బి.ఓబులేసు కుమారుడు బోయ శ్రీనివాసులు అలియాస్ శీనను అరెస్ట్ చేశారు.
అపహరించారు ఇలా...
కీర్తన ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న నరేష్ (పరారీలో ఉన్నాడు), సతీష్‌కుమార్ ఇద్దరూ కలిసి కదిరిలో మణుప్పరం ఫైనాన్స్ సంస్థలో పనిచేసేవారు. ఇద్దరూ విలాసాలు, జల్సాలకు అలవాటుపడ్డారు. జల్సాలు తీర్చుకునేందుకు సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు. దీంతో సతీస్‌కుమార్ తన క్లాస్‌మీట్ సాయికృష్ణతో పాటు పరిచయమున్న బోయ శ్రీనివాసులు, హెచ్‌డీఎఫ్‌సీలో పనిచేస్తున్న జయరాంతో కలసి పథకం రచించారు. ఇందులో భాగంగా బ్యాంక్‌లో బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు వచ్చిన ఖాతాదారులను ఏమార్చి ఆ బంగారాన్ని కీర్తన ఫైనాన్స్‌లో కస్టమర్లకు తెలియకుండా మళ్లించి రుణం పొందేవారు. గడువు పూర్తయిన ఖాతాలకు సంబంధించి నగలను కూడా ఖాతాదారులకు తెలియకుండానే నగదు చెల్లించి.. బంగారు తీసుకెళ్లి కీర్తన ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టేవారు. ఇలా జయరాం పేరిట 330 గ్రాములు, బోయ శ్రీనివాసుల పేరిట 650 గ్రాములు, సాయి కృష్ణ పేరిట 1200 గ్రాములు కీర్తన ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఖాతాదారు తనఖా పెట్టిన బంగారానికి సంబంధించిన ప్యాకెట్ ట్యాంపర్ అయి ఉండడం గమనించిన హెచ్‌డీఎఫ్‌సీ మేనేజర్ ఫిర్యాదుతో మొత్తం బాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో నలుగురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నరేష్ కోసం గాలిస్తున్నారు. కేసులో మిస్టరీని ఛేదించి, నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సీఐ ఎన్.జగదీష్, ఎస్‌ఐలు ప్రసాద్, విజయ్ భాస్కర్ నాయుడును ఎస్పీ పి. జగదీష్ అభినందించారు.
ఖాతాదారులకు తెలియకుండా తాకట్టు బంగారం స్వాహా
నలుగురి అరెస్ట్
పరారీలో మరొకరు