
అప్పుల ఊబిలో రాష్ట్రం
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం
అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రం రూ.1.50 లక్షల కోట్ల అప్పల ఊబిలో కూరుకుపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. అనంతపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్‌తో కలసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రమూ చేయనన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేస్తోందన్నారు. అమరావతి పేరుతో రూ.31 వేలు కోట్లు అప్పు తెచ్చారన్నారు. మరో రూ.31 వేల కోట్ల అప్పు చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. చంద్రబాబు ఢిల్లీ, సింగపూర్ పర్యటనల వల్ల రాష్ట్రానికి మేలు జరగకపోగా.. అప్పుల భారం మరింత పెరుగుతోందన్నారు. 21సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి ఏమి సాధించారో చెప్పాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. పోలవరం ఎత్తు తగ్గించినా నోరుమెదపలేకపోయారని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సహకరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ట్రూఅప్ చార్జీల పేరుతో ఆరు నెలల్లోనే రూ.15,480 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు. సమావేశంలో సీపీఐ ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు జాఫర్, వేమయ్యయాదవ్, సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, కార్యదర్శివర్గ సభ్యుడు రాజారెడ్డి, నగర కార్యదర్శి శ్రీరాములు పాల్గొన్నారు.