
కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
కళ్యాణదుర్గం: ఏసీబీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి నేతృత్వంలోని బృందం శుక్రవారం కూడా కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముమ్మరంగా సోదాలు కొనసాగించింది. గురువారం రాత్రి నాగేంద్ర నాయక్ నుంచి భూమి కన్వర్షన్‌కు రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా అనంతపురంలో ఏసీబీ అధికారులు కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామిని పట్టుకున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే రాత్రికి రాత్రి కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన అధికారులు రెండో రోజూ కూడా కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ సమక్షంలో కీలక ఫైళ్లను తనిఖీ చేశారు. ఇటీవల చేసిన భూముల కన్వర్షన్, మున్సిపాలిటీ పరిధిలో చేసిన రిజిస్ట్రేషన్ తదితర ఫైళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని భూముల కన్వర్షన్ లేకుండానే ఎన్ని ఫైళ్లు రిజిస్ట్రేషన్ చేశారు.. డబుల్ రిజిస్ట్రేషన్లు.. ఇటీవల కళ్యాణదుర్గం, కంబదూరు, బ్రహ్మసముద్రం తహసీల్దార్ల సంతకాలు ఫోర్జరీ చేసి సృష్టించిన డాక్యుమెంట్లు తదితర వాటికి సంబంధించిన కీలక ఫైళ్లను తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ల వెనుక ఏవైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా.. ఎవరెవరికి వాటా వెళ్లింది.. అనే కోణంలో కూడా సబ్ రిజిస్ట్రార్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. తనిఖీల అనంతరం ఫైళ్లను కర్నూలుకు తీసుకెళ్లనున్నట్లు ఏసీబీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి మీడియాకు తెలిపారు.