
రోడ్డు ప్రమాదాలు నివారించాలి
అనంతపురం అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో రోడ్డు భద్రతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రమాదాలు అధికంగా చోటు చేసుకునే ప్రదేశాల్లో (బ్లాక్‌స్పాట్) హెచ్చరిక సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతస్థాయిలో నిర్వహించాలన్నారు. ప్రధానంగా హెల్మెట్ ధారణ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ప్రయాణికులను చేరవేసే వాహనాల్లో అధికలోడ్ నియంత్రించాలని సూచించారు. సమావేశంలో ఆర్టీఓ వీర్రాజు, డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌డీఓ కేశవనాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలి..
జిల్లాలో పారిశ్రామిక రంగం పటిష్టం చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు అందిన దరఖాస్తులకు సకాలంలో అన్ని రకాలు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు అనువైన భూమిని గుర్తించాలన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న రతన్‌టాటా ఇన్నొవేషన్ హబ్ ద్వారా యువతకు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2020–23, 2023–27 ఇండస్ట్రియల్ పాలసీ కింద 13 యూనిట్లకు సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాస్‌యాదవ్, ఏడీ రాజశేఖర్‌రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ అధికారి కృష్ణారెడ్డి, డీఎస్‌డీఓ ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొనానరు.