
వ్యాపారి ఘరానా మోసం
ఉరవకొండ: పట్టణంలో ఓ వ్యాపారి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. పలువురి నుంచి నగదు తీసుకుని.. తిరిగి వారికి చెల్లించకుండా ముఖం చాటేశాడు. దాదాపు రూ.6.22 కోట్లకు ఐపీ పెట్టేసి టోకరా వేశాడు. బాధితులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉరవకొండ పట్టణంలోని రంగావీధిలో బొమ్మశెట్టి నగేష్‌బాబు, లావణ్య దంపతులు నివాసముంటున్నారు. వీరు కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. అలా ప్రజలతో ఏర్పడిన పరిచయాలతో చిట్టీల వ్యాపారం మొదలు పెట్టారు. వీరిపై నమ్మకం కలగడంతో చాలామంది పరిచయస్తులు, చిరువ్యాపారులు, చేనేత కార్మికులతో పాటు అన్ని వర్గాలకు చెందిన వారు అవసరాలకు పనికి వస్తుందని, పొదుపు చేసుకుందామని భావించి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా చిట్టీలు వేశారు. ఉరవకొండతో పాటు ధర్మవరం, గుంతకల్లు, అనంతపురం తదితర ప్రాంతాలకు చెందిన వారు అప్పుల రూపంలోనూ వారికి ఇచ్చారు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం అనారోగ్యంగా ఉందని చెప్పిన నగేష్ తర్వాత కనిపించలేదు. కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరూ లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. ఫోన్ స్విచాఫ్ వస్తుండటంతో అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీయగా.. డబ్బుతో ఉడాయించినట్లు తెలిసింది.
కలకలం రేపిన ఐపీ నోటీసు..
బాధితుల అనుమానాలకు ఊతం ఇచ్చేలా శుక్రవారం పలువురి సెల్‌ఫోన్లకు నగేష్‌బాబు– లావణ్య దంపతుల తరఫున అడ్వొకేట్ నుంచి ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) నోటీసు పంపారు. ఐపీ నోటీసు అలా ఒకరి నుంచి మరొకరికి చేరడంతో కలకలం రేగింది. కిరాణా వ్యాపార విస్తరణ కోసం 57 మంది నుంచి రూ.6.22 కోట్ల వరకు నగదు తీసుకున్నట్లు.. ప్రస్తుతం వ్యాపారంలో నష్టం కారణంగా తిరిగి చెల్లించలేకపోతున్నట్లు, నగదు రికవరీ కోసం ఒత్తిళ్లు తీవ్రస్థాయిలో పెరిగి పోతుండటంతో భరించలేక ఐపీ పెడుతున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. నమ్మకంతో చిట్టీలు వేసినందుకు.. అప్పులు ఇచ్చినందుకు ఇప్పుడు ఐపీ పెట్టేసి నట్టేటముంచితే తమ పరిస్థితి ఎలా అని బాధితులు ఆందోళన చెందుతున్నారు.
రూ.6.22 కోట్లకు టోకరా
లబోదిబోమంటున్న బాధితులు
న్యాయం కోసం పోలీసుస్టేషన్‌కు..
మాకు న్యాయం చేసేదెవరు..?
తన కూతురుకు మూడుసార్లు బైపాస్ సర్జరీలు జరిగాయని, తదుపరి వైద్య అవసరాల కోసమని నగేష్‌బాబు వద్ద దాదాపు రూ.14 లక్షలు చిట్టీ వేశానని, ఇప్పుడిలా ఐపీ పెట్టేస్తే ఎలా అని ఉరవకొండకు చెందిన కిరణ్‌కుమార్ అనే హోటల్ నిర్వాహకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని అర్బన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. తామేమీ చేయలేమని పోలీసులు తెలిపారని, ఇక తాము ఎక్కడికి వెళ్లాలని కన్నీటి పర్యంతమయ్యాడు.

వ్యాపారి ఘరానా మోసం

వ్యాపారి ఘరానా మోసం