
జేసీ ప్రభాకర్‌రెడ్డిది నీచ సంస్కృతి
అనంతపురం మెడికల్: ‘తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ‘గుడ్ విల్’ కోసం డీపీఓ, ఏఎస్పీలను బెదిరిస్తున్నారు. ఆయన భార్యను నేను తిట్టానని ప్రచారం చేస్తున్నాడు. రాజకీయాల్లోకి ఆడవారిని తీసుకువచ్చే నీచ సంస్కృతి జేసీ ప్రభాకర్‌రెడ్డిది. నిజంగా నేను తిట్టానని ఆమె చెబితే వారి ఇంటి వద్దకు వెళ్లి క్షమాపణ చెబుతా’ అని వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లే అవుట్ల అనుమతులకు సంబంధించి డీపీఓను, పవర్ గ్రిడ్ పనుల్లో తనకు మేలు జరగలేదని ఏఎస్పీను జేసీ ప్రభాకర్‌రెడ్డి దుర్భాషలాడారన్నారు. తాడిపత్రిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లే అవుట్ల అనుమతులకు సంబంధించి కలెక్టర్‌కు జేసీ ఫిర్యాదు చేయాలని, తాను ప్రతిపక్ష పార్టీ తరపున ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కలెక్టర్ విచారణలో అసలు నిజాలు వెలుగు చూస్తాయన్నారు. ఇటీవల తాడిపత్రిలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి తన కోడలను పంపితే.. ఆమె ప్రసంగం పూర్తవగానే పోలీసుల ద్వారా ఇంటికి పంపించేశారని అన్నారు. ఇది జేసీ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు.
దొంగే దొంగ అన్నట్లుంది జేసీ తీరు
తనపై వంద కేసులున్నాయని, తనకు న్యాయం చేయాలని జేసీ ప్రతిసారీ పరితపిస్తున్నారని పెద్దారెడ్డి విమర్శించారు. వాస్తవానికి ఫేక్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్‌లతో అక్రమాలకు పాల్పడి ఆయన కటకటాల్లోకి వెళ్లి వచ్చారన్నారు. ఆయనేమైనా పార్టీ కోసమో, కార్యకర్తలు, నాయకుల కోసమే జైలుకు వెళ్లలేదని స్పష్టం చేశారు. వందల సంఖ్యలో ఉన్న కేసుల పూర్వాపరాలను సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పరిశీలిస్తే జేసీ నీచ సంస్కృతి బయటపడుతుందన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరు ఉందని మండిపడ్డారు. పోలీసు అధికారుల వద్దకు వెళ్లి కేసు నమోదు చేయించాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి