అయ్యవార్లకు ‘ఓటీపీ’ తలనొప్పి | - | Sakshi
Sakshi News home page

అయ్యవార్లకు ‘ఓటీపీ’ తలనొప్పి

Jul 26 2025 8:44 AM | Updated on Jul 26 2025 9:44 AM

అయ్యవ

అయ్యవార్లకు ‘ఓటీపీ’ తలనొప్పి

స్టూడెంట్‌ కిట్లు అందినట్లు ధ్రువీకరణకు తల్లిదండ్రుల మొబైళ్లకు ఓటీపీలు

ఓటీపీ నంబర్లు చెప్పడానికి

నిరాకరిస్తున్న తల్లిదండ్రులు

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం (2025–26)లో పంపిణీ చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర (స్కూడెంట్‌ కిట్ల) కిట్ల నిర్ధారణ కోసం విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్‌ ఫోన్లకు వచ్చే ఓటీపీలు తీసుకోవడం ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. మొన్నటిదాకా బయోమెట్రిక్‌ విధానంలో తల్లిదండ్రుల నుంచి వేలిముద్రలు తీసుకుని నిర్ధారించుకునేవారు. అయితే తాజాగా ఓటీపీ విధానం తీసుకొచ్చారు. తల్లిదండ్రుల మొౖబైల్‌ ఫోన్లకు ఓటీపీ వెళ్తే...సంబంధిత హెచ్‌ఎం, టీచరు ఫోన్‌ చేసి ఆ ఓటీపీ నంబరు అడిగి యాప్‌లో నమోదు చేస్తే కిట్లు అందినట్లు ధ్రువీకరించనట్టవుతుంది. ఈ విధానం అయ్యవార్లకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. జిల్లాలో 1,648 స్కూళ్లల్లో 1–10 తరగతుల విద్యార్థులు 1,98,556 మంది చదువుతున్నారు. వీరందరికీ స్కూడెంట్‌ కిట్లు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నా...క్షేత్రస్థాయిలో చాలామంది విద్యార్థులకు కిట్లలోని అన్ని వస్తువులూ నేటికీ అందలేదు. మరీ ముఖ్యంగా చాలా మండలాలకు ‘షూ’లు అన్‌సైజ్‌ వచ్చాయి. అలాగే యూనీఫాం అందలేదు. ప్రతి స్కూల్‌లోనూ స్టూడెంట్‌ కిట్ల పంపిణీ సమాచారాన్ని ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఈ యాప్‌ను హెచ్‌ఎంలు, టీచర్లు అందరూ తమ మొబైళ్లల్లో డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. యాప్‌లో వివరాలన్నీ నమోదు చేసి.. ఓటీపీ సబ్‌మిట్‌ చేయడానికి 8 – 10 నిమిషాలు పడుతోంది. దీనికితోడు కొందరు ల్లితల్లిదండ్రులు తమ మొబైల్‌ నంబర్లకు వచ్చే ఓటీపీని చెప్పడానికి నిరాకరిస్తుండటం మరింత ఇబ్బందికరంగా మారింది.

దానిమ్మకు వైరస్‌ వర్రీ

తాడిపత్రిటౌన్‌: దానిమ్మ పంటను వైరస్‌ దెబ్బ తీస్తోంది. యర్రగుంటపల్లిలో రైతు సూర్యనారాయణ ఏడేళ్ల క్రితం ఆరు ఎకరాల్లో దానిమ్మ సాగు చేసారు. ఏటా రూ.10 లక్షల వరకు పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం అంతంత మాత్రంగానే పంట దిగుబడులు వచ్చాయి. మార్కెట్‌కు తరలించేలోపే దానిమ్మ కాయలకు వైరస్‌ వ్యాపించింది. దీనికితోడు వర్షాభావ పరిస్థితులతో చెట్లు ఎండుముఖం పట్టాయి. చేసేది లేక రైతు పంటను తొలగించారు. దాదాపు రూ.70 లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయారు.

హుండీలపై తలోమాట

నార్పల: గూగూడు కుళ్లాయిస్వామి ఆలయంలోని హుండీల సంఖ్యపై గందరగోళం నెలకొంది. అధికారుల విరుద్ధ ప్రకటనలే ఇందుకు కారణం. మొహర్రం ఉత్సవాలకు గూగూడు ప్రసిద్ధి. ఉత్సవాల సందర్భంగా భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను ఈ నెల 18న లెక్కించారు. నాలుగు హుండీలు లెక్కించినట్లు ఆలయ ఈఓ శోభారాణి ఇదివరకు మీడియా సమక్షంలో ప్రకటించారు. అయితే గురువారం ఆర్డీఓ కేశవనాయుడు ఆలయాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడినపుడు ఐదు తాత్కాలిక, ఒక శాశ్వత హుండీలలోని కానుకలు లెక్కించినట్లు చెప్పారు. ఆర్డీఓ – ఈఓ మాటలకు పొంతన లేకుండా ఉండటంతో హుండీలలో కొన్ని మాయమయ్యాయా.. అందులోని కానుకలు ఏమయ్యాయి అంటూ భక్తుల్లో అనుమానాలు తలెత్తాయి. ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అసలు ఎన్ని హుండీలు ఉన్నాయో అధికారులకు తెలియకపోవడం ఏమిటని చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిజానిజాలు వెల్లడించాలని కోరుతున్నారు.

అయ్యవార్లకు ‘ఓటీపీ’ తలనొప్పి 1
1/2

అయ్యవార్లకు ‘ఓటీపీ’ తలనొప్పి

అయ్యవార్లకు ‘ఓటీపీ’ తలనొప్పి 2
2/2

అయ్యవార్లకు ‘ఓటీపీ’ తలనొప్పి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement