
తుంగభద్రమ్మ ఉగ్రరూపం
బొమ్మనహాళ్: తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. టీబీ డ్యాంకు వరద పోటెత్తింది. జలాశయానికి ఎగువన ఉన్న తుంగ డ్యాం నుంచి 70 వేల క్యూసెక్కులు, భద్ర డ్యాం నుంచి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయగా.. ఇదే క్రమంలో పరివాహక ప్రాంతాల్లో వర్షం భారీగా కురవడంతో వదర ఉరకలెత్తుతూ డ్యాంకు చేరుతోంది. ఈ క్రమంలో టీబీ బోర్డు అధికారులు డ్యాం గేట్లన్నీ తెరిచి లక్ష క్యూసెక్కుల నీటిని నదికి వదిలేస్తున్నారు. నీటి విడుదల నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల గ్రామాలకు హెచ్చరికలు జారీ చేశారు. నది వైపు రైతులు, జాలర్లు, మత్య్సకారులు వెళ్లరాదని సూచించారు. తుంగభద్ర జలాశయంలో 1,633 అడుగులకు గాను ప్రస్తుతం నీటి నిల్వ 1,625.43 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, డ్యాం 19వ గేటు సరిగా లేని కారణంగా దాన్ని కుదించారు. 80 టీఎంసీలు నిల్వ చేసి మిగిలిన నీరు నదికి విడుదల చేస్తున్నారు. 19వ గేటు మినహా అన్ని గేట్లు తెరిచి నీటిని నదికి వదులుతున్నారు.