
అక్రమాలకు పాల్పడితే చర్యలు
● శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఎస్‌ఆర్‌ఓకు అవినీతి అధికారిగా పేరుంది. గతంలో కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు అరోపణలు ఉన్నాయి. క్రయ, విక్రయదారులు లేకుండానే థర్డ్ పార్టీ వ్యక్తులతో కుమ్మకై ్క భారీస్థాయిలో డబ్బులు దండుకొని గతంలో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్‌ను రద్దు చేశారు. దీనిపై ఫిర్యాదు రావడంతో.. కిందిస్థాయి ఉద్యోగులపై తప్పును నెట్టారు. ఉన్నతాధికారులు మరోమారు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి సబ్ రిజిస్ట్రార్ పాత్ర ఉందంటూ నివేదిక ఇవ్వడంతో సస్పెండయ్యారు. ప్రస్తుతం బుక్కపట్నంలో సైతం అదే పంథాలో విధులు నిర్వర్తిస్తున్నారు. టీడీపీ నేతల అండతో పెద్ద ఎత్తున అసైన్డ్, ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తోంది.
అనంతపురం టౌన్: ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అక్రమాలకు నిలయాలుగా మారాయి. క్రయవిక్రయాలకు సంబంధించి డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయాలంటే అధికారులకు చేయి తడపాల్సిందే. లేదంటే కొర్రీలు వేసి రిజిస్ట్రేషన్లు కాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అనంతపురం జిల్లాలో 12, శ్రీసత్యసాయి జిల్లాలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాలు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారు చెబితే ఎలాంటి భూములకై నా రిజిస్ట్రేషన్లు చేస్తారు. వారి ఆజ్ఞ లేకుంటే పట్టా భూములను సైతం రిజిస్ట్రేషన్ చేయకుండా కొర్రీలు చూపుతారు. ఇటీవల చిలమత్తూరులో సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తూ ఇటీవలే కదిరికి బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ పెద్ద మొత్తంలో డబ్బు దండుకుని చిలమత్తూరు పరిధిలో ఓ ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయం కాస్తా పార్లమెంట్ స్థాయి ప్రజాప్రతినిధి దృష్టికి వెళ్లడంతో ఆయన రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగమేఘాలపై ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేశారు. ధర్మవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఫ్రీ హోల్డ్ భూములను అక్కడి సబ్ రిజిస్ట్రార్ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేశారు. కూడేరు మండలం కమ్మూరులో డైక్లాట్‌లో రోడ్డుగా ఉన్న 5 ఎకరాల స్థలాన్ని ఏడాది క్రితం ఓ సబ్ రిజిస్ట్రార్ భారీగా ముడుపులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం ఆ రోడ్డు స్థలంలో ఓ వెంచర్ వెలిసిందంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో స్పష్టంగా అర్థం అవుతోంది.
నామమాత్రంగా ఏసీబీ దాడులు..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏడాదికి, రెండేళ్లకోసారి నామమాత్రంగా దాడులు నిర్వహిస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో కేవలం మూడుసార్లు మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. అనంతపురం రామ్‌నగర్ కార్యాలయంలో పని చేస్తున్న సబ్ రిజిస్ట్రారు సత్యనారాయణపై ఏసీబీ దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. బుక్కపట్నంలో ఎస్‌ఆర్‌ఓ శ్రీనివాసులు ఏడాది క్రితం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే ఆయన ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకొని చైన్నె వెళ్లి అక్కడ ఓ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామి రూ.5లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
అక్రమాలకు నిలయంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా కాసులు ఇవ్వాల్సిందే
టీడీపీ నేతల కనుసన్నల్లో పని చేస్తున్న అధికారులు
ఉమ్మడి జిల్లాలో భారీగా అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు
రూ.లక్షల్లో దండుకుంటున్న సబ్ రిజిస్ట్రార్లు
భూ యజమానులపైనే కేసులు..
అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి పొలం రుద్రంపేట పరిధిలో అత్యంత విలువైన 5 ఎకరాల పొలం లావాదేవీలపై భూ యజమానులు కోర్టులో దావా వేశారు. కోర్టులో దావా నడుస్తున్న ఆ భూమిని ఓ మిల్క్ డెయిరీ నిర్వాహకుడు కొనుగోలు చేశాడు. డెయిరీ నిర్వాహకునితో రూరల్, అనంతపురం రామ్‌నగర్ కార్యాలయాల్లో పని చేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు కుమ్మకై ్క రూ.లక్షల్లో డబ్బులు తీసుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. బాధిత భూయజమానులు రామ్‌నగర్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తే.. విధులకు ఆటంకం కలిగించారని వారిపైనే పోలీస్ స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేయడం గమనార్హం.
సబ్ రిజిస్ట్రార్లు అక్రమాలకు పాల్పడితే శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. సబ్ రిజిస్ట్రార్లు ప్రభుత్వ అదాయాన్ని పెంచే విధంగా వ్యవహరించాలి. ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడిస్తే సహించేది లేదు. కళ్యాణదుర్గం సబ్‌రిజిస్ట్రార్‌పై ఏసీబీ దాడుల నివేదిక ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటాం. – విజయలక్ష్మి, డీఐజీ,
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, అనంతపురం

అక్రమాలకు పాల్పడితే చర్యలు