
‘ఉపాధి’లో ప్రజాధనం లూటీ
అనంతపురం అర్బన్: ‘‘శింగనమల నియోజకవర్గ పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఉపాధి పనులు అధికార పార్టీ నాయకుల దోపిడీ వనరులుగా మారాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, అధికార పార్టీ నాయకులు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. అక్రమాలు అరికట్టాలని కోరుతూ సోమవారం ఆయన కలెక్టరేట్‌లో ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ బుక్కరాయసముద్రం మండలంలో ‘ఉపాధి’ వాటాల చెల్లింపుల్లో తేడాలు రావడంతో టీడీపీ నాయకులు రోడ్డుపైనే కొట్టుకున్నారన్నారు. నార్పల మండల పరిధిలో అక్రమాలకు పాల్పడిన అధికారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించినా ఇంకా విధుల్లో కొనసాగుతున్నారని తెలిపారు. పుట్లూరు మండలంలో చనిపోయిన వ్యక్తుల పేరు మీదా బిల్లులు పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకున్నారని చెప్పారు. పనికి హాజరుకాని వారితో వారం రోజుల కూలీలో సగం సొమ్ము, పనికి హాజరైన వారితో వారానికి రూ.200 నుంచి రూ.300 చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది వసూలు చేస్తున్నారన్నారు. అక్రమ సొమ్ములో అధికారులకు వాటాలు ఇస్తున్నట్లు బాహాటంగానే చెబుతున్నారన్నారు. వాటాలు కుదరని చోట రోడ్లపైకి వచ్చి తన్నుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయన్నారు. జిల్లాలో అన్ని చోట్లా అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే అనేక సార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, కూలీల శ్రమను దోపిడీ చేస్తున్న వారిపై ఇప్పటికై నా చర్యలు తీసుకుని నిబద్ధత చాటుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీ సభ్యులు ప్రతాపరెడ్డి, భాస్కర్, వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, పూల ప్రసాద్, మహేశ్వరరెడ్డి, ఖాదర్‌వలి, ఎల్లారెడ్డి, కొర్రపాడు భాస్కర్‌రెడ్డి, నాగలింగారెడ్డి, ముసలన్న, సాకే నారాయణస్వామి, బొమ్మన శ్రీరామరెడ్డి, కంచిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్వతమ్మ, శ్రీనివాసరెడ్డి, మంత్రి అంజి, అరిక నరేష్, పూలనారాయణస్వామి, బయపరెడ్డి, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అధికార పార్టీ నాయకుల అంతులేని దోపిడీ
మాజీ మంత్రి శైలజనాథ్ మండిపాటు
శింగనమలలో అక్రమాలపై
ఇన్‌చార్జ్ కలెక్టర్‌కు ఫిర్యాదు