మచ్చుకు కొన్ని | - | Sakshi
Sakshi News home page

మచ్చుకు కొన్ని

Jul 29 2025 7:26 AM | Updated on Jul 29 2025 7:58 AM

మచ్చు

మచ్చుకు కొన్ని

ఎదుటి వ్యక్తి బలహీనత వారికి ఆసరాగా మారింది. ఇతరుల అవసరాలను ఆలంబనగా చేసుకున్నారు. మాయ చేశారు.. ఆశ చూపారు.. వల విసిరారు. అందులో చిక్కుకున్న సామాన్యులను నిట్టనిలువునా ముంచి రూ.కోట్లలో దోచుకున్నారు. ఇది ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో వెలుగు చూస్తున్న వ్యవస్థీకృత ఆర్థిక నేరం. మాఫియాను తలదన్నేలా మోసగాళ్లు చెలరేగిపోవడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

అనంతపురం: కుటుంబ అవసరాలు, పిల్లల చదువులకు కాయకష్టంతో చిరువ్యాపారులు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు సంపాదించిన సొమ్ము కాస్త పరుల పాలవుతోంది. భవిష్యత్తు అవసరాలకు పొదుపు చేసుకోవాలనే వారిలోని తపనను మోసగాళ్లు తెలివిగా సొమ్ము చేసుకుని బోర్డు ఫిరాయిస్తున్నారు. అధిక వడ్డీలు ఇస్తామని కొందరు.. క్రిప్టో కరెన్సీతో డాలర్లు మూటగట్టుకోవచ్చని మరికొందరు ఉచ్చులోకి లాగేస్తున్నారు. ఈ క్రమంలో దాచుకున్న డబ్బుతో పాటు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు.

బలహీనతలే ఆసరాగా...

డబ్బు సంపాదించాలనే సామాన్య, మధ్య తరగతి ప్రజల బలహీనతలను ఆసరా చేసుకున్న కొందరు క్రిప్టో కరెన్సీ ఉచ్చులోకి తాము చిక్కుకోవడం కాక... పలువురిని అందులోకి లాగేశారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే డాలర్లలో సంపాదన ఉంటుందన్న నమ్మబలికారు. ఈ మాయలో చిక్కుకున్న వారు తాము దాచుకున్న డబ్బుతో పాటు అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారు. చివరకు మోసపోవడంతో మనోవేదనతో నలిగిపోతున్నారు. భారత ప్రభుత్వ ఆమోదం లేని కంపెనీలు కేవలం వెబ్‌సైట్‌ ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తూ రూ. కోట్లలో మోసానికి తెరలేపాయి. మెటా ఫండ్‌ పేరుతో మొదలైన క్రిప్టో దందా.. రెండు నెలలకే మెటా ప్రో అని పేరు మార్చుకుంది. డబ్బులు రెట్టింపు అవుతాయని ఆశ చూపి రూ.కోట్లు వసూలు చేసి బోర్డు ఫిరాయించింది. లక్ష కడితే రోజూ 15 నుంచి 20 అమెరికన్‌ డాలర్లు వస్తాయని ఆశ చూపి రూ.లక్ష నుంచి కోటి రూపాయల వరకూ ఒక్కొక్కరి నుంచి డిపాజిట్‌ చేయించుకున్నట్లుగా తెలుస్తోంది.

సామాన్యుల నడ్డి విరిచిన అధిక వడ్డీ ఆశ

సామాన్యుల ఆర్థిక అవసరాలను అనువుగా మార్చుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిట్టీ వ్యాపారం ఊపందుకుంది. చిట్టీ ఎత్తిన వారికి నగదు చెల్లించకుండా నిర్వాహకులు అధిక వడ్డీ ఆశ చూపుతున్నారు. ఇదే అసలు మోసానికి తెరతీస్తోంది. ఇందుకు నిదర్శనమే ఇటీవల ఉరవకొండలో వెలుగుచూసిన ఉదంతం. ఉరవకొండలోని రంగావీధిలో నివాసముంటున్న దంపతులు నగేష్‌బాబు, లావణ్య.. కిరాణా దుకాణం నిర్వహిస్తూ స్థానికులతో మంచి పరిచయాలు పెంచుకున్నారు. అనంతరం చిట్టీల వ్యాపారం మొదలు పెట్టారు. ఒక్కొక్కరు రూ. 3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ చిట్టీలు కట్టారు. చిట్టీలు ఎత్తిన వారికి అధిక వడ్డీ ఆశ చూపి నగదు చెల్లించకుండా మిన్నకుండిపోయారు. రెండు వారాల క్రితం కుటుంబంతో సహా నగేష్‌ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇంటికి తాళం వేసి ఉంది. ఫోన్‌ స్విచాఫ్‌ వస్తుండడంతో అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీయగా, డబ్బుతో ఉడాయించినట్లు తెలిసింది. ఈలోపు పలువురి సెల్‌ఫోన్ల వాట్సాప్‌ నంబర్‌కు నగేష్‌ బాబు దంపతుల లాయర్‌ పంపిన ఇన్‌సాల్వెన్సీ పిటిషన్‌ (ఐపీ) నోటీసు అందింది. 57 మందితో రూ.6.22 కోట్ల వరకు నగదు తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇలా ఉమ్మడి జల్లా వ్యాప్తంగా చిట్టీలు, క్రిప్టో కరెన్నీస అధిక వడ్డీల ఉచ్చులో పడి మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఉమ్మడి జిల్లాలో అధికమవుతున్న ఆర్థిక నేరాలు

ప్రజల అవసరాలతో ఆటలు

రూ.లక్షల్లో నష్టపోతున్న బాధితులు

చిట్టీలు, క్రిప్టో కరెన్సీ, అధిక వడ్డీల మాయలో సామాన్యులు విలవిల

2021లో కళ్యాణదుర్గంలో ‘సహారా ఇండియా పరివార్‌’ పేరుతో ఓ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఇందులో స్థానికులు ఆంజనేయులు, సలాం కీలకం. వీరు ఏజెంట్లను నియమించుకుని భారీ వడ్డీ ఆశ చూపి చిరు వ్యాపారులు, మధ్యతరగతి ప్రజల నుంచి వారం వారం డిపాజిట్ల పేరుతో డబ్బు వసూలు చేశారు. ఐదేళ్లు, మూడేళ్ల కాల వ్యవధితో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే రెట్టింపు మొత్తాన్ని ఇస్తామని ఆశ చూపడంతో దాదాపు వెయ్యి మంది సభ్యులుగా చేరారు. వారం వారం కంతులు చెల్లిస్తూ వచ్చారు. మెచ్యూరిటీ గడువు ముగియడంతో నగదు చెల్లించాలని ఖాతాదారులు ఒత్తిడి చేశారు. దీంతో ఆంజనేయులు, సలాం పత్తా లేకుండా పోయారు. ఏజెంట్లూ మాయమయ్యారు. ఈ దందాలో కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా బాధితులు మోసపోయినట్లు సమాచారం.

ధర్మవరానికి చెందిన ఓ వ్యాపారి క్రిప్టో కరెన్సీ మోజులో పడ్డాడు. తొలుత భారీగా ఆదాయం వచ్చింది. దీంతో మరి కొంత మందిని చేరిస్తే మరింత లాభం వస్తుందని ఆశపడ్డాడు. బంధువులు, స్నేహితులు అందరికీ క్రిప్టో కరెన్సీ గురించి చెప్పి ఏకంగా రూ.10 కోట్ల వరకు పెట్టుబడి పెట్టించాడు. ఆ తర్వాత సదరు కంపెనీ బోర్డు తిప్పేయడంతో ప్రస్తుతం రోజూ బెంగళూరులోని క్రిప్టో కరెన్సీ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లడం.. సాయంత్రానికి ధర్మవరానికి చేరుకోవడం పరిపాటిగా మారింది.

అనంతపురం నగరంలో బ్లాక్‌మనీ అధికంగా ఉండే ఓ సామాజిక వర్గం వారు ఓ వెబ్‌సైట్‌ను నమ్మి క్రిప్టో కరెన్సీలో రూ.20 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టారు. వారం కిందట అప్‌డేట్‌ చేస్తున్నామని చెప్పి లింక్‌ తొలగించారు. ఆ తర్వాత అడ్రస్‌ గల్లంతు కావడంతో తేలు కుట్టిన దొంగల్లా మారింది వారి పరిస్థితి. ఇలా వీరు మాత్రమే కాదు. ఒక్క అనంతపురం నగరంలోనే అత్యాశపరులు క్రిప్టో కరెన్సీ మోజులో పడి తక్కువలో తక్కువగా రూ.100 కోట్లు పైగానే మోసపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

మచ్చుకు కొన్ని 1
1/1

మచ్చుకు కొన్ని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement