
బాధితులపైనే అక్రమ కేసు బనాయింపు
అనంతపురం: తమపై టీడీపీ నాయకులు దాడి చేసినా కేసు నమోదు చేయని పోలీసులు.. తమనే నిందితులుగా పేర్కొంటూ అక్రమ కేసు బనాయించారంటూ ఎస్పీ జగదీష్ ఎదుట బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాల యంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీని కలసి తన గోడు వెళ్లబోసుకుంది. వివరాలు.. కళ్యాణదుర్గం మండలం ఎం. కొండాపురం గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న కె.సుధారాణి, శ్రీనివాసాచారి దంపతులపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వై. సురేష్, లాల్ కృష్ణ ఈ నెల 13న దాడి చేసి దుర్భాషలాడారు. దీనిపై అదే రోజు సుధారాణి కళ్యాణదుర్గం రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నేటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. పైగా దాడి చేసిన వారి నుంచి ఫిర్యాదు తీసుకుని సుధారాణి దంపతులపై అక్రమంగా కేసు బనాయించారు. దీంతో న్యాయం కోరుతూ దాడి సమయంలో తీసిన ఫొటోలను జతపరుస్తూ సోమవారం ఎస్పీకి బాధితురాలు ఫిర్యాదు చేశారు. కాగా, ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 87 వినతులు అందాయి. ఎస్పీ స్వయంగా వినతులు స్వీక రించి, బాధితులతో మాట్లాడారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
పంద్రాగస్టుకు
పకడ్బందీ ఏర్పాట్లు
అనంతపురం అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ ఎ.మలోలతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాట్లకు సంబంధించి అప్పగించిన బాధ్యతలను పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై స్టాళ్లు, శకటాలు సిద్ధం చేసుకోవాలని, ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులను అవార్డులకు ఎంపిక చేసి జాబితాను కలెక్టర్ కార్యాలయానికి పంపించాలన్నారు.
పంటల బీమా చేయించండి
‘వాతావరణ ఆధారిత పంటల బీమా ప్రీమియం చెల్లింపు ప్రక్రియ ఈనెల 31తో ముగుస్తుంది. 1,50,100 మంది రైతులకుగానూ ఇప్పటికి 10,194 మందే పంట నమోదు చేసుకున్నారు. మిగిలిన వారు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోండి’ అని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. బీమా అంశంపై ఆయన సమీక్షించారు. పంట సాగు చేసిన ప్రతి రైతూ బీమా ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
వర్సిటీ ప్రతిష్టను కాపాడాలి
● ఎస్కేయూ ఇన్‌చార్జ్ వీసీ అనిత
అనంతపురం: ఎస్కేయూ ప్రతిష్టను కాపాడేలా విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలని ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత అన్నారు. ఎస్కేయూ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘పీఎం ఉష’ పథకం కింద వర్సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రాముఖ్యతను వివరించారు. ఇంక్యుబేషన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. విశిష్ట అతిథిగా హాజరైన విక్రమ సింహపురి వర్సిటీ మాజీ వీసీ, ఎస్కేయూ మాజీ రెక్టార్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి మంచి స్థానానికి చేరుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. క్రీడల్లో సత్తా చాటిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకట నాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ బాబు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

బాధితులపైనే అక్రమ కేసు బనాయింపు