
మా గోడు వినండి.. ఆదుకోండి
అనంతపురం అర్బన్: ‘మా గోడు వినండి.. ఆదుకోండి’ అంటూ అధికారులను ప్రజలు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రజల నుంచి ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ ఎ.మలోల తదితరులు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 560 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో ఇన్‌చార్జ్ కలెక్టర్ సమీక్షించారు.అర్జీల పరిష్కారంలో ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదని, సమస్యను క్షుణ్ణంగా తెలుసుకుని నాణ్యమైన పరిష్కారం చూపించాలని చెప్పారు.
వినతుల్లో కొన్ని...
● సాగు చేసుకుంటున్న భూమికి పట్టా ఇప్పించాలని రాప్తాడు మండలం యర్రగుంట గ్రామా నికి చెందిన నారాయణమ్మ విన్నవించింది. యర్రగుంట గ్రామ పొలం సర్వే నంబరు 127లో 1.61 ఎకరాలను 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని చెప్పింది. పట్టా మంజూరు చేయాలని 2015 నుంచి అర్జీలు ఇస్తూనే ఉన్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన చెందింది.
● తమ భూమికి సంబంధించి అడంగల్, 1బీ రావడం లేదని కళ్యాణదుర్గంలోని పార్వతి నగర్‌కు చెందిన సరోజమ్మ విన్నవించింది. 2006లో ప్రభుత్వం తమకు 5.01 ఎకరాల భూమి మంజూరు చేసిందని, అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నామని తెలిపింది. పాసుపుస్తకం కూడా ఉన్నా 2017 నుంచి 1బీ, అడంగల్ రావడం లేదని చెప్పింది.
ఈ వృద్ధురాలి పేరు కె.నల్లమ్మ. ఈమెది శింగనమల మండలం కల్లుమడి గ్రామం. ఈమె భర్త చనిపోయి 23 ఏళ్లు అవుతోంది. కల్లుమడి గ్రామ పొలం సర్వే నెంబరు 142/3లో తమ రిజిస్టర్ భూమి 3.09 ఎకరాలు విక్రయించగా మిగిలిన 85 సెంట్లు భూమి ఈమె అనుభవంలో ఉంది. 2021లోనే సర్వే చేసి భూమి కొలతల పటం ఇచ్చారు. పాసు పుస్తకం మంజూరు చేయండంటూ తహసీల్దారు కార్యాలయం చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా పట్టించుకోలేదు. కలెక్టర్ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం ఇచ్చినా పని జరగలేదు. ఈ క్రమంలో పాసుపుసక్తం ఇప్పించాలని కోరుతూ మళ్లీ అర్జీ ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వచ్చింది.

మా గోడు వినండి.. ఆదుకోండి