
కసాపురంలో శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం
గుంతకల్లు రూరల్: కోరిన కోర్కెలు తీర్చే పెన్నిధిగా, భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనార్థం భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ పురవీధులు పోటెత్తాయి. శోభాయమానంగా విరాజిల్లుతూ భక్తులకు దర్శనమిస్తున్న నెట్టికంటుడి సేవలో భక్తులు తరించారు. స్వామివారి నామస్మరణతో ఆలయ పురవీధులు మార్మోగాయి. శ్రావణమాసం మొదటి శనివారం సందర్భంగా సీతారామలక్ష్మణులతో కలిసి ఆంజనేయస్వామి వారు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం వేకువజామునే అర్చకులు స్వామివారి మూల విరాట్‌కు అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని స్వర్ణ కవచ అలంకరణ, ప్రత్యేక పుష్పాలతో అందంగా అలంకరించి పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్లను శేషవాహనంపై కొలువుదీర్చి అందంగా అలంకరించారు. ఆలయ ఈఓ కే.వాణి, ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి ప్రాకారోత్సవం నిర్వహించారు. శేషవాహనంపై కొలువుదీరిన స్వామివార్లు ఆలయం చుట్టూ ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేపట్టారు.

కసాపురంలో శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం