
పాఠశాలలో పెచ్చులూడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
గుంతకల్లుటౌన్: స్థానిక ఆలూరు రోడ్డులోని సెయింట్ పాల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో శనివారం మధ్యాహ్నం తరగతి గది పైకప్పు పెచ్చులూడి పడి 7వ తరగతి చదువుతున్న ఓంకార్, స్టీఫెన్‌జాయ్ అనే విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్ర గాయాలైన ఇద్దరినీ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ మస్తాన్‌రావు విద్యార్థులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం ప్రమాదం జరిగిన తరగతి గదిని ఆయన పరిశీలించారు. ఎంఈఓ మస్తాన్‌రావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం అనంతరం ఏడో తరగతి గదిలో క్లాసులు జరుగుతుండగా పైకప్పు పెచ్చులూడి పడిందన్నారు. దీంతో విద్యార్థుల తలకు బలమైన గాయాలయ్యాయన్నారు. ఇద్దరికీ తలకు కుట్లు పడ్డాయని చెప్పారు. పాఠశాల కరస్పాండెంట్ అందుబాటులో లేరని, సోమవారం మరోసారి పాఠశాలను తనిఖీ చేసి జరిగిన ఘటనపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపుతానని పేర్కొన్నారు. ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని వన్‌టౌన్ సీఐ మనోహర్ తెలిపారు.

పాఠశాలలో పెచ్చులూడి విద్యార్థులకు తీవ్ర గాయాలు