
అధికారుల కనుసన్నల్లోనే ‘ఉపాధి’ అక్రమాలు
బుక్కరాయసముద్రం: మండలంలో ‘ఉపాధి’ అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయన్నారు. ఉపాధి కూలీలు పనులకు రాకున్నా వారి పేరున ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉన్న టీడీపీ కార్యకర్తలు బిల్లులు రాసుకుంటున్నారని ఆరోపించారు. కూలీల వద్ద వారం వారం డబ్బు వసూలు చేస్తూ దందాకు తెరలేపారన్నారు.అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు జరుతున్నాయని, ఎంపీడీఓ,ఏపీఓ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీకేఎస్‌లో జాబ్ కార్డుల పంపకాల్లో తేడాలు వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు దాడులు చేసుకుంటున్నారన్నారు. ఉపాధి అక్రమాలను అరికట్టకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నరేష్, చంద్ర, బయపరెడ్డి, రంగా, నాగరాజు, నాగ, సాకే లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.