భూసంరక్షణతోనే భావితరాల మనుగడ | - | Sakshi
Sakshi News home page

భూసంరక్షణతోనే భావితరాల మనుగడ

Dec 5 2023 5:20 AM | Updated on Dec 5 2023 5:20 AM

- - Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: మానవునికి మట్టికి అత్యంత అవినాభావ సంబంధం ఉంది. సమస్త జీవులకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప సంపద ‘నేల’. భూమి లేనిదే తిండి లేదు. కట్టుకునేందుకు బట్ట... నివాసానికి ఇల్లూ ఉండదు. ఈ క్రమలో నేలను, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భావితరాల మనుగడకు భూసంరక్షణ చర్యలు అత్యంత అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో నేల ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు ఏటా డిసెంబర్‌ 5న ప్రపంచ నేల ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

భూసంరక్షణపై దృష్టి:

ఏటా జనాభా పెరుగుతోంది. ఈ క్రమంలోనే పారిశ్రామిక రంగం, నాగరికత, నగరీకరణ పెరుగుతోంది. కానీ అదే నిష్పత్తిలో నేల పెరగడం లేదు. జిల్లాలో 70 శాతం మంది ప్రజలు నేలను నమ్మకునే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో జనాభా అవసరాలకు అనుగుణంగా పంట ఉత్పత్తులను పెంచే క్రమంలో విచ్ఛలవిడిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల నేల ఆరోగ్యం క్షీణిస్తోంది. పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని పంటలు పండడం కష్టమైంది. పెట్టుబడులు పెరిగి రైతులు నష్టాల పాలవుతున్నారు. ప్రజారోగ్యానికీ విఘాతం కలుగుతోంది. దీంతో భూ సంరక్షణ చర్యలు అనివార్యమయ్యాయి.

భూసార పరీక్షల ద్వారా సమతుల్యత

భూసంరక్షణలో భాగంగా ప్రతి రైతూ కనీసం మూడేళ్లకోసారి మట్టి పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఉమామహేశ్వరమ్మ, స్థానిక భూసార పరీక్షా కేంద్రం (ఎస్‌టీఎల్‌) ఏడీఏ రోజాపుష్పలత తెలిపారు. ప్రకృతి వరప్రసాదమైన నేలలో సహజంగానే కొన్ని పోషకాలు ఉంటాయన్నారు. ఇటీవల నేల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉండడంతో భూసార పరీక్షల ద్వారా నేలలో ఉండే పోషకాలు తెలుసుకుని... అవసరమైన పోషకాలు సమపాళ్లలో అందించాలని సూచిస్తున్నారు. దీని వల్ల భూసారం పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయన్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని గణనీయంగా తగ్గించి వాటి స్థానంలో వర్మీకంపోస్టు, పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, పందుల ఎరువు లాంటి సేంద్రియ పోషకాలు వినియోగించడం అత్యంత శ్రేయస్కరమని సూచించారు. భూసంరక్షణ చర్యలు చేపట్టి భావి తరాలకు బంగారు భూమిని బహుమతిగా అందించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నేడు ప్రపంచ నేల ఆరోగ్య దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement