
అనంతపురం అర్బన్: జిల్లాలో దీపావళి పండుగను పురస్కరింకొని 253 మందికి టపాసుల విక్రయాల కోసం తాత్కాలిక లైసెన్స్‌ను జిల్లా రెవెన్యూ శాఖ మంజూరు చేసింది. ఈ మొత్తంలో అనంతపురం నగరానికి సంబంధించి 123 మందికి తాత్కాలిక లైసెన్స్ మంజూరు చేశారు. లైసెన్స్ పత్రాన్ని డీఆర్‌ఓ గాయత్రిదేవి జారీ చేస్తున్నారు. ప్రస్తుతం మంజూరు చేసిన లైసెన్స్ పూర్తిగా తాత్కాలికమని, దీపావళి పండుగ సందర్భంగా టపాసుల విక్రయాలకు మాత్రమే వర్తిస్తుందని డీఆర్‌ఓ స్పష్టం చేశారు.
వైద్యుడిపై వరకట్న
వేధింపుల కేసు
అనంతపురం క్రైం: ప్రభుత్వ వైద్యుడు అభిషేక్ సామ్రాట్‌పై దిశ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. వివరాలను దిశ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ చిన్నగోవిందు తెలియజేశారు. నగరంలోని రెవెన్యూ కాలనీకి చెందిన సరిత, ప్రభుత్వ వైద్యుడు అభిషేక్ సామ్రాట్ ప్రేమ వివాహం చేసుకున్నారు.అభిషేక్ సామ్రాట్ కొంత కాలంగా డబ్బుపై వ్యామోహంతో భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో బాధితురాలు దిశ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ దంపతులకు రెండు సార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా, ఫలితం లేకపోవడంతో సరిత ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్నం వేధింపుల కింద కేసు నమోదు చేశారు.
యువకుడి ఆత్మహత్య
కుందుర్పి: మండల కేంద్రానికి చెందిన శ్రీకాంత్ (26) గ్రామ శివారులోని నాలుగు స్తంభాల మంటపం వద్ద గురువారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. కుందుర్పికి చెందిన హనుమంతరాయుడు, చెన్నక్క దంపతుల కుమారుడు శ్రీకాంత్ ఇంటర్ తర్వాత టీటీసీ పూర్తి చేశాడు. ఏడాది కాలంగా ఇంటివద్ద ఉంటూ బేల్దారి పనులకు వెళ్లేవాడు. టీటీసీ పూర్తి చేసి ఇంటివద్ద ఎందుకుంటావు.. ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి గురైన శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎర్రిస్వామి తెలిపారు.
నిందితులు
రిమాండ్‌కు తరలింపు
గార్లదిన్నె: హత్య కేసులో నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్‌ఐ గురుమూర్తి శుక్రవారం తెలిపారు. కోటంకకు చెందిన కోమల అనే యువతిని తల్లి అంజినమ్మ, సోదరుడు కేదార్‌నాథ్ గొంతుకు చున్నీతో బిగించి, హత్య చేశారన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు యువతి తల్లి, అన్నను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

శ్రీకాంత్ (ఫైల్)