నక్కపల్లి/ఎస్.రాయవరం: ఆశా కార్యకర్తలకు రెండేళ్లుగా నిరాశే ఎదురవుతోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న వందలాది మంది ఆశా కార్యకర్తలు మంగళవారం అడ్డురోడ్డు జంక్షన్ నుంచి హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంపు కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మంత్రి అనితను కలిసి తమ సమస్యలు వివరించి వినతిపత్రం అందజేయాలని ఆశా కార్యకర్తలు ప్రయత్నించినప్పటికీ ఆమె అందుబాటులో లేకపోవడంతో క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న భద్రతా సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఏళ్ల తరబడి తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, కనీసం ఉద్యోగ భద్రత కూడా కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.10 వేలతోనే కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. విధుల్లో భాగంగా నెలలో నాలుగైదుసార్లు పీహెచ్‌సీలకు వెళ్లేందుకు సుమారు రూ.4 వేల వరకు ఖర్చవుతోందని తెలిపారు.
మిగిలిన రూ.6 వేలతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూటమి నాయకులు ఆశా కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని గుర్తుచేశారు.
అధికారంలోకి రాకముందు తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లు గడిచినా ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని ఆరోపించారు. వేతనాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని,, దహన సంస్కారాలకు నిధులు మంజూరు చేయాలని, పీహెచ్‌సీలకు వెళ్లేందుకు టీఏ, డీఏలు చెల్లించాలని, రూ.10 లక్షల బీమా అమలు చేయాలని, గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేయాలని, అన్ని రకాల సెలవులు మంజూరు చేయాలని, పని ఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆశా కార్యకర్తలకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో సీఐటీయూ నాయకులు శాంతి, సత్యనారాయణ, రాజేష్‌తో పాటు వందలాది మంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
అనకాపల్లి: ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పనిభారం తగ్గించాలని ఆశా వర్కర్ల యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ నుంచి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ క్యాంపు కార్యాలయం వరకూ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచాలన్నారు. సమస్యలు పరిష్కరించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి గనిశెట్టి సత్యనారాయణ, ఆశ కార్యకర్తల యూనియన్ నాయకులు సూర్యకళ, లక్ష్మి, రమణమ్మ, బంగారమ్మ, తదితరులు పాల్గొన్నారు.


