తుమ్మపాల: ప్రజల ఆర్థిక ప్రగతికి, పేదలు, ఔత్సాహికుల స్వయం ఉపాధికి విరివిగా రుణాలు అందించి జిల్లా అభివృద్ధిలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ(డీసీసీ) బ్యాంకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, ఆర్థికాభివృద్ధి పథకాలకు అనుగుణంగా అర్హులకు రుణ సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యా రుణాలు, ఎంఎస్‌ఎంఈ, పీఎం సూర్య ఘర్, వ్యవసాయ, ఇన్వెస్ట్‌మెంట్ క్రెడిట్ రుణాల మంజూరును పెంచాలని సూచించారు. బ్యాంకులు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తున్న పథకాలకు పెద్దఎత్తున రుణాలు మంజూరు చేయాలన్నారు. అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, బ్యాంకర్లతో సమన్వయ సమావేశాలు నిర్వహించి రుణాల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యార్థులకు విద్యా రుణాలపై విస్తృత అవగాహన కల్పించి, వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద రుణాల మంజూరును పెంచడంతో పాటు సౌర విద్యుత్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ రుణాల మంజూరు, రెన్యువల్ సమయంలో రీసర్వే కారణంగా సమస్యలు తలెత్తితే రెవెన్యూ అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్, డీసీసీ/డీఎల్‌ఆర్‌సీ కన్వీనర్ మాధురి తోలేనా, లీడ్ బ్యాంక్ మేనేజర్ జగదీశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ శచీదేవి, వివిధ బ్యాంకుల మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


