సాగునీరు | - | Sakshi
Sakshi News home page

సాగునీరు

Aug 4 2026 1:11 AM | Updated on Aug 4 2026 1:11 AM

నాతవరం: బిటిష్‌ హయాంలో నిర్మించిన నిమ్మకట్టు ఆనకట్ట పరిధిలో పంట కాలువలో పూడికతీత పనులపై అధికారుల అవగాహన రాహిత్యం రైతుల పాలిట శాపంగా మారింది. క్షేత్ర స్థాయిలో నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు చూపిన పనులకు ప్రాధాన్యం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోనే ఏకైక మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయరు నీరుపై ఆధారపడి రెండు జిల్లాల పరిధిలో ప్రతి ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో 52 వేల ఎకరాలు వరి పంట సాగు చేస్తుంటారు. ప్రాజెక్టులో కాస్త నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండడంతో ఆగస్టులో ఖరీఫ్‌ సాగుకు నీరు విడుదల చేసేందుకు ప్రాజెక్టు కమిటీ అధికారులు నిర్ణయించారు. తాండవ ప్రాజెక్టులో ఉన్న నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తే కేవలం 70 రోజులు మాత్రమే ప్రవహిస్తుంది. మిగతా పంట కాలానికి నీటి కోసం వరుణుడిపై ఆధారపడాలి. నీటిని ఆయకట్టుకు విడుదల చేసే ముందు పంట కాలువలో పూడికతీత పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఆలా చేయకుండా నీరు విడుదల చేస్తే శివారు ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి ఉంది. తాండవ ప్రాజెక్టు నిర్మాణం చేయక ముందు మండలంలో రాజుపేట అగ్రహారం గ్రామ సమీపంలో తాండవ నదిపై బ్రిటిష్‌ హయాంలో నిమ్మకట్టు ఆనకట్ట నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆనకట్ట ప్రధాన కాలువలు పూడిక, పిచ్చిమొక్కలు పెరిగిపోయి కాలువలు కన్పించని విధంగా దర్శనమిస్తున్నాయి. ఆయా పంట కాలువలు అభివృద్ధి చేయకుండా తాండవ రిజర్వాయర్‌ నీటిని ఖరీఫ్‌ సాగుకు విడుదల చేస్తే నీరంతా వృథా అవుతుందని రైతులు చెబుతున్నారు. ఈ నెల 18న తాండవ రిజర్వాయరు దిగువన ఆయకట్టుకు నీటి విడుదల కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టు కమిటీ రైతుల సమావేశంలో నిమ్మకట్టు ఆనకట్ట పరిధిలో కాలువలు అభివృద్ధి చేయాలని నీటి సంఘం అధ్యక్షుడు అప్పన దివాణం, ఈ ప్రాంత రైతులు అఽడిగారు. ఈ సమస్య చాలా కాలంగా వెంటాడుతుందని ఒక కిలోమీటరు మేర పూడిక పనులు చేపట్టాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇంతవరకూ ఎటువంటి పను లు చేపట్టలేదు. రెండు రోజుల క్రితం ఈ ఆనకట్ట పరిధిలో గల నాతవరం మండలం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలాలకు చెందిన నీటి సంఘాల అధ్యక్షులు ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ కరక సత్యనారాయణ రైతులతో కలిసి కాలువలో పూడికను స్వయంగా ఇరిగేషన్‌ అధికారులకు చూపించారు. పంట కాలువల ద్వారా నాతవరం మండలంలో రాజుపేట అగ్రహారం, మన్యపురట్ల, లింగంపేట, కొత్త రామచంద్రపురం, వి.బి.ఆగ్రహారం, మాసయ్యపేట, బుచ్చెంపేట, వై.బి.అగ్రహారం, ఎం.బి.పట్నం, గన్నవరం, వై.బి.పట్నం, గన్నవరం మెట్ట, కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో అల్లి పూడి, కాకరాపల్లి , లక్ష్మిపురం, భీమవరపుకోట, ఎస్‌.ఆర్‌.పేట, అప్పలరాజుపేట, బిళ్లనందూరు, ఇండుగబిల్లి జగన్నాథపురం, కోటనందూరు గ్రామా ల పరిధిలో సుమారుగా 10వేల ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉంది. తాండవ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసినా నిమ్మకట్టు అనకట్ట కాలువలు అభివృద్ధి చేయకపోతే ఆయా గ్రామాల్లో పంట పొలాలకు సాగునీరు ప్రవహించదు. తాండవ ప్రాజెక్టు నీరు విడుదల చేసేలోగా పంట కాలువలు బాగు చేయాలని ఆయకట్టుదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

బ్రిటిష్‌ హయాంలో నిర్మించిన నిమ్మకట్టు ఆనకట్ట ఆనకట్టపై ఆధారపడి రెండు జిల్లాల్లో వేలాది ఎకరాల ఆయకట్టు కాలువల్లో పేరుకుపోయిన పూడిక, పెరిగిన తుప్పలు పూడికతీతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం తాండవ నీరు విడుదల చేసినా వృథా కావడం తథ్యం శివారు భూములకు నీరందడం ప్రశ్నార్థకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement