ఫణిగిరి కొండపై ఆగని దందా | - | Sakshi
Sakshi News home page

ఫణిగిరి కొండపై ఆగని దందా

Aug 4 2026 1:11 AM | Updated on Aug 4 2026 1:11 AM

156/పీ సర్వే నంబర్‌లో భారీ మైనింగ్‌

విచారణ జరపడంలో తాత్సారం

అందుకే హైకోర్టును ఆశ్రయించాం

అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న జిల్లా కలెక్టర్‌

వైఎస్సార్‌సీపీ యలమంచిలి సమన్వయకర్త కరణం ధర్మశ్రీ

యలమంచిలి: రాంబిల్లి మండలం పంచదార్లలో ముక్కంటి కొలువైన ఫణిగిరి కొండపై అక్రమ తవ్వకాలు చేపడుతూ అక్రమ క్వారీకి పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ప్రశ్నించారు. సోమవారం ఆయన యలమంచిలిలో స్థానిక విలేకర్లతో మాట్లాడారు. పంచదార్ల ఫణిగిరి కొండపై సర్వే నెంబరు 1తో పాటు, 156/పీ సర్వే నంబరులో భారీ స్థాయిలో అక్రమ క్వారీని నిర్వహించారని ఆరోపించారు. కానీ సర్వే నంబర్‌ 1కు సంబంధించి మాత్రమే రాంబిల్లి తహసీల్దార్‌, అనకాపల్లి ఏడీ మైన్స్‌, స్థానిక వీఆర్వోపై చర్యలు తీసుకుని చేతులు దులిపేసుకున్నారని చెప్పారు. అక్రమ గ్రావెల్‌ తవ్వకాలకు సంబంధించిన ఫొటోలు, మ్యాపులను ఆయన చూపారు. సర్వే నంబరు 1 మాట అలా ఉంచితే సర్వే నం.156/పీ సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ అక్రమ క్వారీకి అనుమతులు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే 2025 జూలై 18వ తేదీన అనుమతులు ఇచ్చారన్నారు. హరిపురంలో అక్రమ క్వారీని నిలుపుదల చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్పారు. ఈ మేరకు స్థానికంగా వున్న ఉప్పులూరి నాయుడు, వెంకటాపురం మాజీ సర్పంచ్‌ తాతబ్బాయి, రాజు తదితరులు హైకోర్టులో పిల్‌దాఖలు చేసినట్టు చెప్పారు. దీనిపై సర్వే జరపకుండా ప్రభుత్వం కేవలం సర్వే నంబర్‌ 1కు సంబంధించి మాత్రమే జరిగిన అక్రమ క్వారీ, తవ్వకాలను పరిగణనలోనికి తీసుకుని దిగువ స్థాయి ఉద్యోగులను సస్పెండ్‌ చేసిందన్నారు. 156 సర్వే నంబరులో జరిగిన అక్రమ క్వారీపై ఇంతవరకూ కనీస విచారణ కూడా జరపలేదని, దీని వెనుక వున్న కారణాలు అందరికీ తెలుసునన్నారు. ఈ వ్యవహారంలో రూ.వందల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. ఒకరిద్దరు బడా రాజకీయ నాయకుల అండదండలతో ఈ అక్రమ మైనింగ్‌ పరమేశ్వరుడు కొలువైన కొండపై జరగడం చాలా బాధాకరమన్నారు. కావాలనే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సర్వే నంబరు 156లో జరిగిన అక్రమ క్వారీపై విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి అసలు సూత్రదారులను చట్టం ముందు నిలబెట్టి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్‌ కూడా అధికారపార్టీ నాయకులు, అక్రమ మైనింగ్‌ చేసే వారిని కాపాడుతూ చిరు ఉద్యోగులను బలిపశువులను చేయడం మంచిది కాదన్నారు. తక్షణమే పంచదార్లలో ప్రాచీన శైవక్షేత్రం సమీపంలో అక్రమంగా తరలించుకుపోయిన లక్షల క్యూబిక్‌ మీటర్ల సంగతి తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో రాంబిల్లి జెడ్పీటీసీ ధూళి నాగరాజు,ఎంపీపీ గొట్టుముక్కల శ్రీనుబాబు,వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement