కశింకోట: ఆర్‌ఈసీఎస్ పరిధిలో కన్సాలిడేటెడ్ పే వర్కర్స్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల జీతాల నుంచి కోతలు విధించడం అన్యాయమని, తగ్గించిన జీతాలను తక్షణమే పునరుద్ధరణ చేయాలని ది అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఒప్పంద ఉద్యోగుల సంఘం, సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక గవరపాలెం ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షుడు సిద్దా గోవిందరావు, ప్రధాన కార్యదర్శి దొడ్డి వెంకట నరసింహనాయుడు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వివి.శ్రీనివాసరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణలు మాట్లాడుతూ ఆర్‌ఈసీఎస్ పరిధిలో 330 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, కన్సాలిడేటెడ్ పే వర్కర్స్‌గా విధులు నిర్వహిస్తున్న కార్మికుల జీతాల నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా కోతలు విధించడం అన్యాయమన్నారు. సుమారుగా 30 నుంచి 35 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామని, ఆర్‌ఈసీఎస్‌ను, ఏపీ ఈపీడీసీఎల్‌లో విలీనం చేసిన తరువాత ప్రభుత్వం కన్యాలిడేటెడ్ పే వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు ఆర్.దొరబాబు, సంఘం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


