వేతన కోతపై పోరుబాట | - | Sakshi
Sakshi News home page

వేతన కోతపై పోరుబాట

Aug 3 2026 12:49 AM | Updated on Aug 3 2026 12:49 AM

సీపీడబ్ల్యూల విధుల బహిష్కరణ

రూ. 2 వేల నుంచి రూ.7 వేల వరకూ తగ్గింపు తగదు ● పాత పద్ధతిలోనే ఇవ్వాలంటూ డిమాండ్‌

సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సరఫరా సహకార సంఘం(ఆర్‌ఈఎస్‌సీవో) పరిధిలో పనిచేస్తున్న కన్సల్టెంట్‌ పేవర్కర్స్‌ (సీపీడబ్ల్యూ)కు ఏపీఈపీడీసీఎల్‌ యాజమాన్యం షాక్‌ ఇచ్చింది. దీంతో వేతనాల్లో భారీగా కోత విధించి తమకు తీవ్ర అన్యాయం చేసిందని ఒప్పంద ఉద్యోగులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తూ పోరుబాట పట్టారు. జూలై నెల వేతనాల్లో హఠాత్తుగా కోత విధించడాన్ని నిరసిస్తూ ఆగస్టు ఒకటో తేదీ రాత్రి నుంచి విధులు బహిష్కరించారు. శనివారం రాత్రి 8.30 గంటలకు ఏపీఈపీడీసీఎల్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఈ) కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన తెలిపారు. సబ్బవరం, పరవాడ, కశింకోట, అనకాపల్లి మండలాల్లో విద్యుత్‌ సరఫరా నిర్వహణ, లైన్ల మరమ్మతులు, ట్రాన్స్‌ఫార్మర్ల పర్యవేక్షణ, కొత్త కనెక్షన్లు ఇవ్వడం, బిల్లుల వసూళ్ల బాధ్యతలను ఈ సిబ్బందే చూస్తున్నారు. వేతనాల తగ్గింపుతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

223 మంది ఉద్యోగుల వేతనాల్లో కోత

ఏపీఈపీడీసీఎల్‌లో ఆర్‌ఈఎస్‌సీవో విలీన ప్రక్రియ ఐదేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ, దీనికి సంబంధించిన ఆస్తుల బదిలీ, కార్మికుల సర్దుబాటు, నిధుల వినియోగం వంటి ప్రక్రియలు నిరంతరం కొనసాగుతున్నాయి. అయితే పూర్తిస్థాయిలో విలీనం కాలేదని, ఆ ప్రక్రియ న్యాయస్థానంలో ఇంకా పెండింగ్‌లో ఉందని, అడ్మినిస్ట్రేషన్‌ బాధ్యత ప్రస్తుతం ఏపీఈపీడీసీఎల్‌కు అప్పగించారని ఉద్యోగులు తెలిపారు. గత 35 ఏళ్లుగా నిబద్ధతతో పనిచేస్తున్న 223 మంది సీపీడబ్ల్యూలకు జూలై నెలకు సంబంధించిన జీతాల్లో విద్యుత్‌ సంస్థ కోత విధించింది. సర్వీసును పరిగణనలోకి తీసుకోకుండా వేతన సవరణ పేరిట కొంతమందికి రూ.7,000, మరికొందరికి రూ.5,000, ఇంకొందరికి రూ.2,000 చొప్పున వేతనాలు తగ్గిచినంట్లు సిబ్బంది వాపోతున్నారు. సంస్థలో పూర్తిస్థాయి విలీనం కాకుండానే వేతన కోతపై నిర్ణయం ఎలా తీసుకుంటారని సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాత పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలి

ఏపీఈపీడీసీఎల్‌ యాజమాన్యం తక్షణమే స్పందించి తమకు పాత విధానంలోనే పూర్తి వేతనాలు చెల్లించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. వేతనాలు తగ్గించడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడవలసి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 20 నుంచి 35 ఏళ్ల పాటు సర్వీస్‌లో మాకు జీతాలు పెంచాల్సింది పోయి..విద్యార్హత, ఏపీఈపీడీసీఎల్‌లో పనిచేసే ఉద్యోగులతో పోల్చుతూ ఎలా తగ్గిస్తారంటూ మండిపడుతున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..

జూలై నెలలో కట్‌ చేసిన జీతాలను వెంటనే అకౌంట్స్‌లో జమచేయాలి.

సీపీడబ్ల్యూ సిబ్బందికి పీఎఫ్‌ 12 శాతం చేయాలి.

ఉద్యోగ భద్రతతో పాటు మెడికల్‌ ఇన్సూరెన్స్‌ రూ.5లక్షలు చేయాలి.

రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌కు

గ్రాట్యుటీ చెల్లించాలి.

పెయిడ్‌ హాలిడేస్‌, మెడికల్‌ లీవ్స్‌ ఇవ్వాలి

2014లో చేసిన తీర్మానం మేరకు 229 పోస్టులు భర్తీ చేయాలి.

విఽధి నిర్వహణలో ఉండగా చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలి.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement